పాక్ పర్యటనకు లంకేయులు ‘నో’

10 September, 2019 - 1:12 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కొలంబో: పాకిస్తాన్ పర్యటకు వెళ్ళకూడదని శ్రీలంక జట్టుకు చెందిన పది మంది క్రీడాకారులు బహిష్కరించారు. పాకిస్తాన్‌లో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందనే తాము వెళ్ళేందుకు నిరాకరిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. వారిలో శ్రీలంక టీ 20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ కూడా ఉన్నాడు. 2009లో లాహోర్‌లో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్‌లో పరిస్థితులను కారణంగా చూపుతూ పది మంది శ్రీలంక క్రికెటర్లు టూర్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకూ శ్రీలంక జట్టు పాకిస్తాన్ గడ్డపై 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ.. శ్రీలంక టి 20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ సహా 10 మంది ఆటగాళ్లు పాకిస్తాన్ వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్టు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఏంజెలో మాథ్యూస్, తిసర పెరెరా, నిరోషన్ డిక్వెలా, కుశాల్ పెరెరా, ధనంజయ డిసిల్వా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చండీమల్, దిముత్ కరుణరత్నే కూడా ఈ టూర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ టూర్ నేపథ్యంలో శ్రీలంక క్రెకెట్ బోర్డు ఆటగాళ్లతో సోమవారం సమావేవం అయింది. ఈ భేటీలో లంక టీ 20 కెప్టెన్ లసిత్ మలింగ, వన్డే జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే సహా పది మంది ఆటగాళ్ళు పాక్‌లో పర్యటించేందుకు నిరాకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ వెళ్లాలా? వద్దా? అనేది తాము ఆటగాళ్లకే వదిలేశామని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలపడం గమనార్హం.

2009లో లాహోర్‌లో శ్రీలంక క్రెకెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో శ్రీలంక ఆటగాళ్లలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం విదేశీ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించాలంటే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది.