పాక్‌ను మట్టికరిపించిన లంక

09 October, 2019 - 2:07 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లాహోర్: లాహోర్ వేదికగా జరిగిన రెండో టీ 20లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టును లంకేయులు 35 పరుగుల తేడాతో మట్టికరిపించారు. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంక కుర్రాళ్ళు టీ20 సీరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పర్యాటక శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 రన్స్ చేసింది. లంక బ్యాట్స్‌మెన్‌లో రాజపక్ష 77 పరుగులతో రాణించాడు. జయసూర్య (34), డసన్ (27) పరుగులు చేశాడు. పాకిస్తన్ బౌలర్లలో వసీమ్, వాహబ్ రిజాయ్, షాదబ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.

తరువాత 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్ జట్టు 147 పరుగులకే చాపచుట్టేసింది. లంక బౌలర్ల ధాటికి 52 పరుగులకే సగం మంది బ్యాట్స్‌మెన్ తమ వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరిపోయారు. ఆసిఫ్ అలీ (29), వసీమ్ (47) మాత్రమే లంకేయులతో కాస్త పోరాడగలిగారు. దీంతో సొంతగడ్డపై ఘోర పరాజయం నుంచి తప్పించుకోగలిగింది. లంక బౌలర్లలో ప్రదీప్ (25 రన్స్‌కు 4 వికెట్లు), హసరంగ (38 పరుగులకు 3 వికెట్లు) పకడ్బందీగా బంతులు వేశారు. ఆఖరి టీ20 కూడా ఇదే వేదికపై బుధవారం జరుగుతుంది.