ప్రత్యేక పేజీల కథా, కమామిషూ

16 January, 2018 - 4:01 PM

మీడియా పల్స్

ఆదివారం పూట ‘హిందూ’ పత్రిక ఎక్కువ పేజీలతో వస్తోంది ఈ మధ్య కాలంలో! టెలివిజన్, రేడియో, ఫేస్‌బుక్, వాట్సప్ వంటివి మనిషి సమయాన్ని నంజుకు తింటుంటే చదివే సమయం ఎలా పెరుగుతుందని- కొందరికి సందేహం రావచ్చు. హిందూ పత్రిక ఇలా పెంచిన పేజీలు ఎంతమంది చదువుతారనే ప్రశ్న అలాగే ఉంటుంది. సర్క్యులేషన్ పెరిగిందో, లేదో మనకు సమాచారం లేదు గానీ – ఈ మార్పుతో గౌరవం తప్పక పెరిగిందని గుర్తించాలి. ఈ గౌరవమే క్రమంగా సర్క్యులేషన్‌గా కూడా మారుతుంది. అయితే పత్రికలకు ఆ స్థాయిలో ఓపిక ఉండాలి. సాధారణ మనుషులలోనే కాదు, వారికి ప్రాతినిధ్యం వహించే మాస్ మీడియాలో కూడా గుంపు ‘మనస్తత్వం’ ధోరణి బాగా ఉంటుంది. నిజానికి సరయిన పరిశోధన చేయడం గానీ, చేయించడం గానీ ఇక్కడ కష్టం కూడా! సాక్షి పత్రిక తొలుత జిల్లా వార్తలను బ్రాడ్ షీట్లలో ప్రారంభించి, పిమ్మట మిగతా పత్రికల దారిలో పడిపోయింది. అలాగే విజయవంతమైన ఫ్యామిలీ పేజీలను మూడేళ్ళ క్రితం సాక్షి సంపాదకవర్గం నాలుగు నుంచి మూడుకు తగ్గించింది. నిజానికి పొరపాట్లు సరిదిద్దుకునే సదుపాయం కానీ, సౌలభ్యం గానీ, ఆసక్తి గానీ తక్కువని భావించాలి.2017 నవంబర్ తొలి వారంలో ఆంధ్రజ్యోతి దిన పత్రిక 16వ ఏట అడుగుపెట్టిన వేళ మరిన్ని పేజీలు, మరిన్ని ఫీచర్లు అని ప్రకటనలు చేసింది. నిజానికి నవంబరు 7వ తేదీ ‘మీడియా పల్స్’లో చర్చించినట్టు ఇటీవల ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలకు సినిమా ప్రకటనల సంఖ్య, సైజు పెరిగాయి. కనుకనే ఈ మధ్య సాక్షి పత్రికలో కూడా ఒక పేజీ సినిమా ప్రకటనలు, మరో పేజీలో సినిమా వార్తలు కనబడుతున్నాయి. ఆంధ్రజ్యోతిలో మరిన్ని సినిమా ప్రకటనలున్నాయి. హిందూ పత్రికలో పేజీలు పెరగడం, తెలుగు పత్రికలలో సినిమా ప్రకటనలు పెరగడం అనే ధోరణుల మధ్య మరో వదంతి కొన్ని నెలలు రాజ్యమేలింది- ఈనాడు పత్రిక పేజీలు పెంచుతోందని! దీనికి ప్రతిధ్వని కూడా కావచ్చు ఆంధ్రజ్యోతి పెరిగిన పేజీల ప్రకటన.అయితే నవంబరు 17 నుంచి ఈనాడు ప్రతి రోజు ఒక ఫీచర్ పేజీ పెంచింది. అంతకు ముందు సినిమా, వసుంధర కాకుండా సుఖీభవ, చదువు, సిరి, ఈతరం వంటి పుటలు ఉండేవి- నిత్యం ఒక మూడు పేజీలుగా! గతంలో సుఖీభవ, చదువు వంటివి ప్రారంభించినపుడు రెండు పేజీలుగా ఉండి- ఇటు అటూ వసుంధర, సినిమా పేజీలతో పుల్ అవుట్‌గా ఇచ్చేవారు. తర్వాత క్రమంగా నాలుగు పేజీలు మూడు పేజీలుగా మారి పత్రికలో అంతర్భాగం అయ్యాయి. ఇపుడు హాయ్, వారెవ్వా, మకరందం, రయ్ రయ్, విజేత పేజీలు సినిమా, మానవాసక్తి, కథనాలు, ఆధ్యాత్మికం, ఆటోమొబైల్, క్రీడలకు సంబంధించిన అంశాలు అదనంగా చేర్చి వీటికి సినిమా, వసుంధర, ఇదివరకు ఉండే ఫీచర్ కలిపి నిత్యం నాలుగు పేజీల పుల్ అవుట్ ఇస్తున్నారు. ఈ అంశాలు మరీ కొత్తవి కావు. ఇవన్నీ కూడా ఏదో రకంగా ఇస్తున్నవే. అయితే ఈనాడు పత్రికలో ఈ సారి శీర్షికల్లో నవ్యత కనబడుతోంది. ఈనాడు శైలికి భిన్నం ఇది.అదే సమయంలో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో కూడా కొన్ని మార్పులు చేశారు. అయితే స్థూలంగా క్రీడలు, టెక్ గాడ్జెట్స్, వ్యవసాయం వంటివి కూడా కనబడుతున్నాయి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. అక్టోబరు 3వ తేదీ ‘మీడియా పల్స్’లో చర్చించినట్టు పాతికేళ్ళ క్రితం ఈనాడు ప్రారంభించిన మహిళల పేజీ లక్ష్యం నేడు మారిపోయింది. మహిళలను షాపింగ్ మాల్స్, బ్యూటి సెలూన్‌ల వైపు పంపే రీతిలో అంశాలు మారాయి. కానీ పదేళ్ళ క్రితం మొదలైన సాక్షి ఫ్యామిలి పేజీలు తెలుగు పత్రికలకు మలుపు. మహిళలు మాత్రమే కాదు, సకుటుంబం అనే రీతిలో అనుబంధం మారింది. అందులో భాగంగానే వసుంధర పుట ఇపుడు లోపలి పేజీల్లోకి వెళ్ళింది. ఆ మేరకు సాక్షికి గట్టి విజయమే! కానీ సాక్షి నిర్వాహకులకు తమ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ గమనించే తీరిక, ఓపిక లేదు. లేకపోతే మూడేళ్ళ క్రితం ఫ్యామిలీ పేజీలను కుదించేవారు కాదు.ఆదివారం సంచిక విషయంలో ఆంధ్రజ్యోతి క్రమంగా ఈనాడు బాటలో పడిపోయింది. ఫలితంగా ప్రత్యేకతను కోల్పోతోంది. అదే సమయంలో సాక్షి ఆదివారం అనుబంధంలో వినోదం పాలు తగ్గి క్రమంగా ప్రయోజనకరమైన అంశాలు బాగా పెరిగాయి. ఈ విషయంలో కూడా సాక్షిని అభినందించాలి. అయితే ఇటీవల సాక్షి సాహిత్యం పేజీలో సినిమా విషయాలు కూడా వస్తున్నాయి. ఇవి అవసరం లేదు. ఆంధ్రజ్యోతి సాహితి పేజీకి లేని ఉదార దృష్టి, విశాల దృక్పథం, వైవిధ్యం సాక్షి సాహిత్యం పేజీకి ఉన్నాయి. వీటిని కోల్పోవడం సవ్యమైన ధోరణి కాదు.చివరకు ‘ది హన్స్ ఇండియా’లో ఇటీవల ‘అపరాజిత’ అని స్త్రీల పేజీ ప్రారంభించారు. తెలుగు పత్రికల ధోరణికి అనుకరణే అయినా మంచిపని. ఇది కొనసాగాలి. అలాగే ఒక రోజు తెలుగు సాహిత్యానికి ఒక పేజీ యివ్వగలరేమో పరిశీలించవచ్చు. దీని వల్ల ఆదాయం పెరగకపోయినా, కీర్తి, గుర్తింపు వస్తాయి. అవి క్రమంగా ఆదాయంగా మారుతాయి!
అందరికీ అభినందనలు.

– డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు