పాఠశాలలో ‘నగ్న నృత్యాలు’!

01 June, 2018 - 12:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

జోహెన్స్‌‌బర్గ్‌: సంప్రదాయం అంటూ ఓ పాఠశాల యాజమాన్యం నిస్సిగ్గుగా చేసిన పని ఇప్పడు దక్షిణాఫ్రికాలో రచ్చ రచ్చగా మారింది. ఒక ఈవెంట్‌ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థినిలతో నగ్న నృత్యాలు చేయించారు. పైగా ఆ వీడియోలు మీడియాలో కూడా అప్‌లోడ్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.

కేప్‌ ప్రొవిన్స్‌‌లోని ఓ స్కూల్‌‌లో గడచిన వారం విద్యార్థినుల ‘నగ్న నృత్యాలు’ ఘటన జరిగింది. చోయిర్‌ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు.. సాంప్రదాయిక ఖ్సోసా నృత్యంలో భాగంగా టాప్‌‌లెస్‌‌గా మారి నృత్యాలు చేశారు. డప్పుల చప్పుళ్లకు లయబద్ధంగా నగ్న దేహాన్ని ఆడించటం ఈ నృత్యం ప్రత్యేకత. ఆ వీడియోలు మీడియాలో, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి.

దీనిపై తల్లిదండ్రులు సహా ప్రజలు భగ్గుమన్నారు. అయితే వారేం పూర్తి నగ్నంగా దృశ్యాలు చేయలేదని, సంప్రదాయ నృత్యానికి అనుగుణంగా దుస్తులు ధరించారని స్కూల్‌ యాజమాన్యం సమర్థించుకోవడం గమనార్హం. ఘటనపై విద్యాశాఖ మంత్రి అంగీ మోట్షేగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపే అని ఆమె అన్నారు. దర్యాప్తునకు ఆదేశించిన ఆమె నివేదిక ఆధారంగా పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా.. అర్ధనగ్న దృశ్యాలు దక్షిణాఫ్రికా చరిత్ర, సంస్కృతుల్లో భాగమే. రీడ్‌ నృత్యాల పేరిట టాప్‌‌లెస్‌‌గా ఉన్న అమ్మాయిలు రాజ వంశస్థుల ముందు నృత్యాలు చేయటం ఓ ఆనవాయితీగా ఉండేది. కానీ, తర్వాత ఆ సంప్రదాయాలు కనుమరుగైపోయాయి. ఈ మధ్య కొన్ని జాతుల ప్రజలు తిరిగి దీనిని ఆచరణలో తెచ్చేందుకు పోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో(రోజుకు 150కి పైగా రేప్‌ కేసుల నమోదు) ఇలాంటి వాటిని ప్రొత్సహించలేమని, చట్టబద్ధం చేయటం కుదరదని ప్రభుత్వం తేల్చేసింది.

అయితే.. ఈ ఆందోళనకారులకు కొన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఘటన చోటు చేసుకోవటం వార్తల్లోకి ఎక్కింది.