భారతీయ విలువల్ని నాశనం చేస్తున్న మోదీ..!

07 June, 2017 - 12:12 PM

భారతీయ విలువలు, మూలాల్ని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. వాటిని పరిరరక్షించడమే లక్ష్యంగా 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ అవినీతి బయటపడకుండా అన్ని వ్యవస్థల్నీ తొక్కిపెడుతున్నారని సోనియా ధ్వజమెత్తారు. దేశ ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ఆలోచనలను మోదీ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని, ప్రజల జీవన విధానాలు, ఆహారపు అలవాట్లపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ విలువలు కాపాడేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపునిచ్చారు.

‘మోదీ ఓ నియంత. తన నియంతృత్వ విధానాలతో వ్యవస్థలు, రాజకీయ పార్టీలు, పౌరసమాజం, మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారు’ అని ప్రధాని మోదీపై సోనియా నిప్పులు చెరిగారు. రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు కేంద్రం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం మంగళవారం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా చాలా రోజుల తర్వాత సీడబ్ల్యూసీ భేటీకి హాజరు కావడం గమనార్హం.

రూ. వెయ్యి, 500 కరెన్సీ నోట్లను రద్దు చేయడం దేశ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిందని సోనియా అన్నారు. జీడీపీ గణాంకాలు కూడా ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితిని మాజీ ప్రధాని మన్మోహన్‌ ముందుగానే ఊహించారని సోయినా పేర్కొన్నారు. నోట్ల రద్దును గొప్ప విజయంగా చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం దాని వల్ల బ్యాంకులకు ఏ మేరకు లబ్ధి చేకూరిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదని అన్నారు. నోట్ల రద్దుతో ఆర్బీఐ నోట్లను లెక్కించడమే మర్చిపోయిందని సోనియా ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.

మోదీ ‘మేకిన్‌ ఇండియా’ నినాదానికి స్పందనగా దేశంలోకి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని సోనియా అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దేశవ్యాప్తంగా అసహనం పెరిగిపోతోందన్నారు. కేంద్రం వైఖరి వల్ల జమ్మూ కశ్మీర్‌ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని సోనియా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చాటేందుకు జమ్మూ కశ్మీర్‌ ఒక్కటి చాలన్నారు. ఎన్డీయే వచ్చాక ఉగ్రదాడులు పెరిగాయన్నారు. సోనియాతో పాటు జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సైతం కశ్మీర్‌ లోయలో కేంద్రం విఫలమైందని విమర్శలు సంధించారు.

సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపైనా చర్చ జరిగింది. భేటీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌‌తో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, పి.చిదంబరం, అంబికా సోని, జనార్ధన్‌ ద్వివేది పాల్గొన్నారు.