నా ‘కన్నా’ ఎందులో ఎక్కువ?

14 May, 2018 - 5:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల పోలింగ్ పూర్తయిందో లేదో… ఆ మరునాడే కమలం పార్టీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్‌‌పై దృష్టి సారించారు. అందులో భాగంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌‌గా సోము వీర్రాజును నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మే 13న ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ ఇద్దరు నేతల ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మే 14న ఢిల్లీలో జరిగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సమావేశానికి వీరిద్దరూ హాజరు కావలసి ఉంది. అలాగే ఈ పదవికి ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను కలసి కృతజ్ఞతలు తెలిపాలని కూడా వారు భావించారు. కానీ అంతలోనే సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే టాక్ వైరల్ అవుతోంది.

అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సోము వీర్రాజుకు కట్టబెడతారని అంతా భావించారు. ఇదే విషయం మీడియాలో కూడా హల్‌చల్ చేసింది. అయితే ఈ పదవి కన్నా లక్ష్మీనారాయణను వరించడంతో సోము వీర్రాజు బ్యాచ్… తీవ్ర ఆగ్రహానికి గురైంది. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని కీలక బీజేపీ నేతలంతా తమ తమ పదవులకు రాజీనామా చేసేశారు. తమ నాయకుడు సోముకు తీవ్ర అన్యాయం చేశారంటూ వారు ఆవేదన చెందుతున్నారు.

‘కన్నా లక్ష్మీనారాయణ నా కన్నా ఎందులో ఎక్కువ? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆ పార్టీలో అగ్రనేతగా ఉండటమే కాకుండా ఎమ్మెల్యేగా, మంత్రిగా పలు కీలక పదవులు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన కన్నా.. రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి, కాషాయం కండువా కప్పుకున్నారు. అంతమాత్రం చేత ఆయనకు ఈ పదవి అప్పగించేస్తారా? పార్టీ అధ్యక్ష పదవి నాకు ఇస్తున్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమనగానే కన్నా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాంటి నాయకుడిని వెళ్లనీయకుండా ఆపి ఎన్నో ఏళ్ల నుంచి కమలం పార్టీని మనసా.. వాచా.. కర్మణా నమ్ముకున్న నాకు.. ఇలాంటి ద్రోహం చేస్తారని కలలో కూడా అనుకోలేదని తన సన్నిహితుల వద్ద సోము వీర్రాజు వాపోయారట. అలాగే టీడీపీపై ఎదురు దాడి అంటే మూడో కాలు మీద లేచే తనకు పార్టీ అగ్రనేతలు ఇలా హ్యాండ్ ఇస్తారని అసలు ఊహించనేలేదన్నారట.

పోలవరం నిర్మాణ వ్యయంపైన.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంపైన.. మొదట హోదా అని… ఆ తర్వాత ప్యాకేజీ అని మళ్లీ హోదా పల్లవి అందుకున్న ఏపీ సీఎం చంద్రబాబును వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను సాక్ష్యంగా చూపి… కబడ్డీ అడుకున్న సంగతి అంతా మరిచిపోయారా అని సోము వాపోతున్నారట. పార్టీ అధ్యక్ష పదవి కన్నాకు కట్టబెట్టే ముందు ఓ సారి హస్తినలోని కమలం పార్టీ పెద్దలు తనతో సంప్రదిస్తే బాగుండేదని ఆయన తెగ ఫీలవుతున్నారట.