లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ కన్నుమూత

13 August, 2018 - 11:03 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కోల్‌‌కతా: లోక్‌‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో సోమ్‌నాథ్ చటర్జీ బాధపడుతున్నారు. ఆదివారం గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఆగస్టు 7 నుంచి కోల్‌‌‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు 40 రోజుల క్రితం మెదడులో నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు.

1929 జూలై 25న అసోంలోని తేజ్‌‌పూర్‌‌లో సోమ్‌‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌‌స్టిట్యూట్‌‌లో పాఠశాల విద్యను ఆయన పూర్తిచేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాక ముందు కలకత్తా హైకోర్టులో ఆయన న్యాయవాదిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ-1 కూటమి నుంచి సీపీఎం వైదొలిగినా ఆయన మాత్రం స్పీకర్‌ పదవికి రాజీనామా చేయలేదు.

సోమ్‌నాథ్ చటర్జీ మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భారత రాజకీయాల్లో మేరునగ ధీరుడైన సోమ్‌నాథ్‌ చటర్జీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలమైన గళం వినిపించారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని ప్రధాని కొనియాడారు. సోమ్‌నాథ్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సోమ్‌నాథ్‌ చటర్జీ ఓ వ్యవస్థ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. పార్టీలకు అతీతంగా పార్లమెంటేరియన్లు అందరూ సోమ్‌నాథ్‌ను గౌరవించేవారని గుర్తుచేశారు. సోమనాథ్‌ చటర్జీ మృతికి రాహుల్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చటర్జీ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.