కోస్తాలో వాహనాలకు మంచు కష్టాలు

11 January, 2019 - 12:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: కొద్ది రోజులుగా కోస్తా అంతటా ఉదయం వేళ మంచుతెర కమ్మేస్తోంది. ఉదయం 9 గంటలైనా మంచు దుప్పటి వీడని పరిస్థితి ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా చెన్నై- కోల్‌‌కతా జాతీయ రహదారి వెళ్తుంది. ఉదయం తొమ్మిది గంటలైనా మంచు వీడని కారణంగా వాహనాల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు వరకూ శుక్రవారం ఉదయం అనేక ప్రాంతాల్లో వాహనాలు మంచు కారణంగా రోడ్లపైనే ఎక్కిడక్కడ నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ప్రయాణించే భారీ వాహనాలు, లారీలు ట్రాఫిక్‌ రద్దీ తక్కువ ఉంటుందనే కారణంతో సాధారణంగా తెల్లవారు జాము నుంచి ఉదయం 8 గంటల లోపు నడపాలని డ్రైవర్లు భావిస్తారు. అలాంటి వారికి పొగమంచు పెద్ద అడ్డంకిగా మారుతోంది.

కన్ను పొడుచుకున్నా కానరానంత దట్టంగా పొగమంచు కమ్మేస్తుండడంతో వాహనాల్ని నడిపించడం తమకు సవాల్‌‌గా మారిందని వాహనాల డ్రైవర్లు వాపోతున్నారు. లైట్లు వేసుకుని వెళ్తున్నా వంద అడుగు దగ్గర్లోని వాహనం కూడా తమకు కనిపించని పరిస్థితి ఉంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దట్టమైన మంచు కురుస్తున్నందు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని జాతీయ రహదారిపై వారు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాల్ని నిలిపివేసి, డ్రైవర్లకు సూచనలు ఇస్తున్నారు.