‘స్నేహమేరా జీవితం’ సినిమా రివ్యూ

17 November, 2017 - 12:51 PM

సినిమా : ‘స్నేహమేరా జీవితం’
నటీనటులు : శివ బాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ తదితరులు
దర్శకుడు : మహేష్ ఉప్పుటూరి
నిర్మాత : శివ బాలాజీ
సంగీతం : సునిల్ కశ్యప్
విడుదల తేది : నవంబర్ 17, 2017.

తెలుగు ఇండస్ట్రీలో గతకొద్ది కాలంగా నటులుగా కొనసాగుతున్న శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ ప్రధాన పాత్రలలో కలిసి నటించిన తాజా చిత్రం ‘స్నేహమేరా జీవితం’. శివబాలాజీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహించారు. స్నేహం, ప్రేమ అనే రెండు అంశాలతో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

1982 నేప‌థ్యంలో సాగే కథాంశం ఇది.. టైటిల్‌ని బ‌ట్టి.. ఇది ఫ్రెండ్ షిప్ క‌థ అని అర్థ‌మైపోతోంది. మోహన్ పాత్రలో శివబాలాజీ, చలపతి పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. మోహ‌న్ అనాధ‌ అయినప్పటికీ చ‌ల‌ప‌తి త‌న సొంత త‌మ్ముడిలా చూసుకొంటాడు. చ‌ల‌ప‌తికి ఎమ్మెల్యే అవ్వాల‌నేది కోరిక‌. కానీ అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఇందిర అనే అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు మోహ‌న్‌. వీరి ప్రేమకు తాను సహాయం చేస్తానంటూ మాటిస్తాడు చలపతి. కానీ ఓ సంధర్భంలో ఇందిరతో చలపతి సన్నిహితంగా వుండటం చూస్తాడు. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుంది. ఒకవైపు చలపతికి కూడా ప్రాణహాని ఏర్పడుతుంది. అసలు మోహన్ చలపతిలకు ఏర్పడిన ముప్పు ఏంటి? వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థలకు కారణమేంటి? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథాంశం.

శివ బాలాజీ, రాజీవ్ క‌న‌కాల పూర్తి స్థాయి పాత్ర‌ల్లో క‌నిపించారు. శివ బాలాజీ పూర్తిగా మాస్ క్యారెక్టర్‌లో ర‌ఫ్‌ లుక్‌తో కనిపిస్తాడు. కొన్ని కొన్ని సీన్లలో చ‌లాకీగా న‌టిస్తూ, ఎమోష‌న్స్‌ని బాగానే పండించాడు. తన పాత్ర మేరకు బాగానే చేసాడు. ఇక చలపతి పాత్రలో రాజీవ్ క‌న‌కాల తన పాత్రలో పూర్తిగా లీనమైపోయాడు. శివ బాలాజీ, రాజీవ్‌ల మ‌ధ్య స్నేహం బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. హీరోయిన్ సుష్మ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే వుందని చెప్పుకోవాలి. నటనకు పెద్దగా స్కోప్ వున్న పాత్ర కాదు. కమెడియన్ సత్య కాసేపు నవ్వించే ప్రయత్నం చేసాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు.

ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య అపార్థాల కారణంగా విడిపోయి, మళ్లీ చివరకు కలుసుకోవడం వంటి కాన్సెప్టులతో ఇప్పటికే చాలా కథలొచ్చాయి. ఇది కూడా అలాంటి కోవలోకే వస్తుంది. కానీ ఈ సినిమాలో ఎంటర్‌టైనింగ్‌ సరైన విధంగా లేకుండా చాలా సాగుతూ వున్నట్లుగా అనిపిస్తోంది. మోహన్, చలపతి క్యారెక్టర్ల మధ్య విభేధాలు ఏర్పడినప్పుడే కథ కూడా పక్కదోవ పట్టేసినట్లుగా అనిపిస్తోంది. కొన్ని కొన్ని చోట్ల ఎమోషన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. అంతగా ఆకట్టుకోలేవని చెప్పుకోవచ్చు.

దర్శకుడు మహేష్ అనుకున్న రొటీన్ స్టోరీలైన్‌ను స్క్రీన్‌ప్లే పరంగా ఆసక్తికరంగా చూపించడంలో విఫలమయ్యాడు. సినిమాటోగ్రఫి బాగోలేదు. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. డైలాగ్స్ పర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. చాలా వరకు కూడా సీన్లు సాగుతూ వున్నట్లుగానే అనిపిస్తాయి. ఇక చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా ఈ స్నేహమేరా జీవితం అంతగా మెప్పించలేకపోయిందని చెప్పుకోవచ్చు.