స్మృతి ఇరానీ అనూహ్య చర్య!

27 May, 2019 - 1:13 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ ఎవరూ ఊహించని విధంగా వ్యవహరించి ఔరా అనిపించుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తన తరఫున విశేషంగా ప్రచారం చేసిన తనకు అత్యంత సమీప అనుచరుడు, బీజేపీ నేత సురేంద్ర సింగ్‌ పాడె కొమ్ము కాశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సురేంద్ర సింగ్ శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. సురేంద్ర నిద్రిస్తుండగా కొందరు దుండగులు ఆయనను తుపాకీతో కాల్చారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లక్నోలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఈ విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ ఆదివారం ఉదయం సురేంద్ర సింగ్ ఇంటికి వెళ్ళారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఆ తరువాత సురేంద్ర సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన పాడె మోశారు.

అమేథీలో స్మృతి ఇరానీ విజయాన్ని ఓర్చుకోలేని స్థానిక కాంగ్రెస్‌ నేతలే తన తండ్రి సురేంద్ర సింగ్‌ను చంపారని ఆయన కుమారుడు అభయ్‌, ఇతర బీజేపీ నేతలు ఆరోపించారు. కానీ… ఇది రాజకీయ హత్య అయి ఉండకపోవచ్చని అమేథీ ఎస్పీ రాజేశ్‌కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత కక్షల నేపథ్యంలో కూడా హత్య జరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయని, వాటి ద్వారా కేసును విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరో 12 గంటల్లో ఈ కేసు కొలిక్కి వస్తుందని చెప్పారు.

హత్యకు గురైన సురేంద్ర సింగ్ అమేథీ నియోజకవర్గంలోని బరౌలి సర్పంచ్‌గా, ఆ గ్రామ బీజేపీ అధ్యక్షుడిగా సురేంద్ర సింగ్ పని చేస్తున్నారు. స్మృతితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన తన సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. అమేథీలో స్మృతిని గెలిపించడానికి సురేంద్ర సింగ్ ఎంతో కృషి చేశారు.

 

.