వినాయక నిమజ్జనంలో విషాదం

11 September, 2019 - 1:02 AM

నిమజ్జనం సందర్భంగా చిన్నారులు మృతిచెందిన చెరువుకుంట

(న్యూవేవ్స్ డెస్క్)

కోలార్‌: వినాయక విగ్రహ నిమజ్జనంలో విషాదం జరిగింది. నిమజ్జనం వేడుకలో పాల్గొన్న ఆరుగురు విద్యార్థులు చెరువు కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా క్యేశంబల్లా సమీపంలోని మరదగట్ట గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నిమజ్జనం కోసం గణేష్‌ విగ్రహాన్ని నీటికుంట వద్దకు తీసుకెళ్లిన సమయంలో ముగ్గురు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు చిన్నారులు కూడా అందులోకి దిగారు. దీనిని గమనించిన గ్రామస్తులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే.. ముగ్గురు పిల్లలు ఘటనా స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మృతులను చిన్నారులు తేజస్వి (11), రక్షిత (8), రోహిత్‌ (10), వైష్ణవి (12), ధనుష్‌ (10), వీణగా గుర్తించారు. వీరిలో వైష్ణవి, రోహిత్ అక్కా తమ్ముళ్ళు, తేజస్వి, రక్షిత అక్కాచెల్లెళ్ళు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఎనిమిది మంది చిన్నారులు చెరువు వద్దకు వెళ్ళారు. వీరిలో ఆరుగురు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువులో దిగగా ఇద్దరు ఒడ్డున నిలబడ్డారు. ఆరుగురు చిన్నారులు ఒక్కసారిగా మరణించడంతో మరదగట్ట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు.