‘సిల్లీ ఫెలోస్’ సినిమా రివ్యూ

07 September, 2018 - 5:01 PM

సినిమా పేరు: సిల్లీ ఫెలోస్‌
జానర్: కామెడీ ఎంటర్‌‌టైనర్‌
నటీనటులు: అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్ర శుక్ల, నందిని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఝాన్సి, బ్రహ్మానందం, రఘు కారుమంచి, చలపతిరావు, రాజా రవీంద్ర.
సంగీతం: శ్రీ వసంత్‌
దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
నిర్మాత: కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి

ఫ్లాప్‌‌లతో ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో అల్లరి నరేష్‌. హీరోగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక తిరిగి కమెడియన్‌‌గా టర్న్‌ అయిన సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌‌టైనర్‌ ‘సిల్లీ ఫెలోస్‌’. రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాసరావు మరోసారి తమిళ రీమేక్‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. న‌రేష్ కామెడీ బాగుంటుంది. న‌రేష్‌కి సునీల్ తోడైతే.. ఆ అల్లరి రెట్టింపు అవడం ఖాయం. ఈ ఇద్దరే ‘కిత‌కిత‌లు’ పెడతార‌నుకుంటే.. కామెడీపై మంచి ప‌ట్టున్న ద‌ర్శకుడు భీమినేని శ్రీ‌నివాస‌రావు తోడ‌య్యారు. ఈ ముగ్గురూ క‌లిస్తే.. వినోదం వీరవిహారం చేయ‌డం గ్యారెంటీ. `సిల్లీ ఫెలోస్‌` పోస్టర్లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు చూసినప్పుడు అదే నమ్మకం క‌లిగింది.ఎంటర్‌‌టైన్మెంట్‌ గ్యారెంటీ అని సినిమా యూనిట్ చాలా నమ్మకం‌గా చెప్పటంతో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ అయింది. అల్లరి నరేష్‌, సునీల్ కెరీర్‌‌కు ఎంతో కీలకమైన సిల్లీ ఫెలోస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందా? అల్లరి నరేష్‌‌కు ఆశించిన విజయం దక్కిందా? తిరిగి కామెడీ టర్న్‌ తీసుకున్న సునీల్‌ ఆకట్టుకున్నాడా? ఈ ముగ్గురూ ఆ న‌మ్మకాన్ని నిల‌బెట్టుకున్నారా? ‘సిల్లీ ఫెలోస్‌’ని ‘ఫ‌న్నీ ఫెలోస్‌’గా మార్చారా? థియేట‌ర్‌లో ఈ ముగ్గురూ క‌లి‌సి చేసిన అల్లరేంటి? చూద్దాం.

కథ:
ఎమ్మెల్యే జాకెట్ జాన‌కిరామ్ (జ‌య‌ప్రకాశ్‌‌రెడ్డి)కి న‌మ్మిన బంటు సూరిబాబు (న‌రేష్‌). జానకిరామ్‌ మంత్రయితే.. తాను ఎమ్మెల్యే అయిపోవాల‌ని ఎదురు చూస్తుంటాడు. జాన‌కి‌రామ్‌‌కి మ‌రింత పేరు రావాల‌ని ఏర్పాటు చేసిన సామూహిక వివాహాల కార్యక్రమం అభాసుపాలు కాకుండా చూస్తాడు సూరిబాబు. దాని కోసం త‌న స్నేహితుడు వీర‌బాబు (సునీల్‌)కి పుష్ప (నందిని)తో బ‌ల‌వంతంగా పెళ్లి చేయించేస్తాడు. అప్పటికే సూరిబాబుకు కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్లి కుదరటంతో పుష్పను వదిలించుకునేందుకు ఎమ్మెల్యే జాకెట్‌‌ను ఆశ్రయించాలనుకుంటాడు. అదే సమయంలో తను ప్రేమించిన వాసంతి (చిత్ర శుక్ల) ఉద్యోగం కోసం వీరబాబు.. జాకెట్‌‌కు పది లక్షల రూపాయలు ఇస్తాడు. ఈ రెండు సమస్యలు పరిష్కరించాల్సిన జాకెట్‌, మినిస్టర్‌ గోవర్థన్‌ను పరామర్శించడానికి హాస్పిటల్‌‌కు వెళ్లి తిరిగి వచ్చే దారిలో ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. మినిస్టర్ చనిపోతూ 500 కోట్లకు సంబంధించిన రహాస్యాన్ని జాకెట్‌‌కు చెప్పటంతో భూతం (పోసాని కృష్ణమురళి) ఆ డబ్బు కోసం జాకెట్ వెంటపడతాడు. గతం మర్చిపోయిన జాకెట్‌ తిరిగి కోలుకున్నాడా? 500 కోట్ల రహస్యాన్ని బయటపెట్టాడా? తమ సమస్యల నుంచి వీరబాబు, సూరిబాబు ఎలా బయటపడ్డారు? అనేది తెలియాలంటే `సిల్లీ ఫెలోస్‌` చూడాలి.నటీనటులు:
అల్లరి న‌రేష్ కామెడీ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సిల్లీ ఫెలోస్‌లోనూ అంతే. కాక‌పోతే పేర‌డీల జోలికి వెళ్లలేదు. అదొక్కటే ప్లస్ పాయింట్‌. వీరబాబు పాత్రకు సునీల్ పూర్తి న్యాయం చేశాడు. కమెడియన్‌‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ తనదైన కామెడీ టైమింగ్‌‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌‌గా చిత్ర శుక్లా పరవాలేదనిపించారు. వాసంతి పాత్రలో యాక్షన్‌ సీన్స్‌‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో కనిపించిన బిగ్‌‌బాస్‌ ఫేం నందినిరాయ్‌ నిరాశపరిచారు. జయప్రకాష్‌‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర రొటీన్‌ పాత్రల్లో కనిపించారు. అతిథి పాత్రలో పూర్ణ తళుక్కున మెరిశారు. క‌థానాయిక‌లు ఇద్దరున్నా ఎవ‌రికీ స‌రైన ప్రాధాన్యం లేదు. బ్రహ్మానందం చాలా కాలం త‌ర‌వాత మళ్లీ తెరపై సందడి చేశారు.విశ్లేషణ:
రీమేక్‌ స్పెషలిస్ట్‌‌ అనే పేరున్న దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మరోసారి రీమేక్‌ కథతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమిళంలో విజయం సాధించిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో రీమేక్‌ చేశారు. కోలీవుడ్‌‌లో ఈ తరహా చిత్రాలు కొత్తైనా మన దగ్గర చాలా వచ్చాయి. దీంతో మరోసారి రొటీన్‌ కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌ ప్రధాన పాత్రల పరిచయం, మంచి కామెడీ సీన్స్‌‌తో ఆకట్టుకున్న భీమినేని రెండో సగంలో ఆ స్థాయిలో అలరించలేకపోయారు. పెద్దగా కథ లేకపోవటంతో ఒకే సన్నివేశాన్ని సాగదీస్తూ టైం పాస్‌ చేశారు. జయప్రకాష్‌‌రెడ్డి, పోసాని కృష్ణమురళి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో హీరోయిన్‌‌ల మధ్య ప్రేమ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. శ్రీ వసంత్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాలో రెండే పాట‌లున్నాయి. అవి బాగున్నాయి. ఈ సినిమాని వీలైనంత త‌క్కువ‌ బడ్జెట్‌‌తో తీయాల‌ని ఫిక్సయిపోయి ఉంటారు. అందుకే క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ్డారు. సంభాషణల్లో కొన్ని చోట్ల పంచ్‌‌లు పేలాయి.
బలాలు:
కామెడీ
నరేష్‌, సునీల్‌ నటన
తొలిస‌గం
పాట‌లు
బ‌ల‌హీన‌త‌లు:
రొటీన్‌ కథా కథనం
సెకండ్‌ హాఫ్
లాజిక్‌లేని సన్నివేశాలు