వన్డేలకు షోయబ్ మాలిక్ గుడ్‌బై

06 July, 2019 - 9:53 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: పాకిస్తాన్‌ సీనియర్ క్రికెటర్, భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ అంతర్జాతీయ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. సీనియర్‌గా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆడిన పాక్ జట్టులో చోటు దక్కించుకున్న మాలిక్‌ దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. మూడు మ్యాచ్‌లే ఆడిన షోయబ్ 8, 0, 0 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో మెగాటోర్నీలో పాకిస్తాన్ జట్టు పేజీ పూర్తయింది. ఈ మ్యాచ్‌లో మాలిక్‌కు చోటుదక్కకపోయినా ఆటగాళ్లు అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ‘క్రికెట్‌ వరల్డ్‌కప్‌’ అధికారిక ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.

అంతకు ముందు షోయబ్ మాలిక్‌ కూడా ట్విటర్‌ వేదికగా అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. ‘ఈ రోజు అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నాను. నాతో ఆడిన ఆటగాళ్లు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లు, కుటుంబ సభ్యులు, మిత్రులు, మీడియా, స్పాన్సరర్లు, ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు. లవ్‌ యూ ఆల్‌.​‍’ అని ట్వీట్‌ చేశాడు.

షోయబ్ మాలిక్ తన చివరి వన్డే మాంచెస్టర్ వేదికగా టీమిండియాపై ఆడాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 89 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో ఓడిపోయింది. మాలిక్‌ ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్‌ 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌ తరఫున ఆడాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు.

20 ఏళ్లపాటు పాక్‌ క్రికెట్‌కు సేవలందించిన మాలిక్‌కు మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్విటర్‌ వేదికగా గ్రీటింగ్స్ చెబుతున్నారు. ‘ప్రతీ కథకు ఓ ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ముగింపునకు ఓ కొత్త ఆరంభం కూడా ఉంటుంది. మాలిక్‌ 20 ఏళ్లు నీ దేశం గర్వించేలా ఆడావు. అలాగే ఎంతో గౌరవం, వినయంతో నీ ఆటను కొనసాగించావు. నీవు సాధించిన ప్రతి మైలురాయి పట్ల నేనెంతో గర్వపడ్డా’ అని సానియా మీర్జా ట్వీట్‌ చేసింది. 2010 ఏప్రిల్‌ 12న పెళ్ళితో సానియా- మాలిక్‌ భార్యాభర్తలయ్యారు.