మళ్లీ తెరపైకి ‘మా’లో లుకలుకలు!

04 September, 2018 - 3:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

‘మా’ (మూవీ ఆరిస్ట్ అసోసియేషన్)లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. ఇప్పటికే టాలీవుడ్‌‌లో కాస్టింగ్ కౌచ్‌ అంటూ శ్రీరెడ్డి తెరపైకి వచ్చి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఈ అంశంపై ‘మా’లోని ప్రముఖులంతా స్పందించారు. ఆ వివాదం సద్దుమణిగీ మణగక ముందే టాలీవుడ్ నటీమణులు ప్రోగ్రాముల పేరుతో యూఎస్‌ వెళ్లి.. అక్కడ వ్యభిచారం చేస్తున్నారని.. అందుకు యూఎస్‌‌లో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిషన్, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారని మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటీమణులు యూఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దీంతో ‘మా’లో కొద్దిగా ఇబ్బంది వాతావరణం నెలకొంది.

తాజాగా ‘మా’లో మరో వివాదం రచ్చకెక్కింది. ‘మా’ ఏర్పాటై 25 ఏళ్లు అయిన సందర్భంగా సరికొత్త హంగులతో కొత్త భవనాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆ క్రమంలో నిధుల సేకరణ కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో చిరంజీవి ముఖ్య అతిథిగా ఓ ఈవెంట్ నిర్వహించారు. అందుకు కోటి రూపాయిలు వసూలు అయినట్లు సమాచారం.

 

చిరంజీవి ఈవెంట్ అంటే కచ్చితంగా కనక’ధార’ కురుస్తుందనే టాక్ దేశ విదేశాల్లో ఉంది. మరీ ఇంత తక్కువ రావడం వెనకేదో మతలబు ఉందని మా ప్రధాన కార్యదర్శి నరేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ‘మా’ నిధులు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా అధ్యక్షుడు శివాజీరాజా… తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’లో పారదర్శకత కొరవడిందని నరేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ క్రమంలో మా అధ్యక్షుడు శివాజీరాజా, ఉపాధ్యక్షుడు హీరో శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి ‘మా’లో ఎటువంటి గోల్ మాల్ జరగలేదని, అన్ని లెక్కలూ పద్ధతిగానే ఉన్నాయని వివరించారు. ‘మా’లో ఏమైనా నిధులు గోల్ మాల్ జరిగినట్లు నిర్ధారణ అయితే ‘మా’ గడప తొక్కనని, తన సభ్యత్వాన్ని వదులుకుంటానని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేస్తే తాను సంపాదించిన ఆస్తులన్నీ ఇచ్చేస్తానని శివాజీరాజా సవాల్ విసిరారు. అయితే హీరో శ్రీకాంత్ మాత్రం ‘మా’లో ఆ నలుగురు కావాలని పనిగట్టుకుని బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని ఆరోపించడం గమనార్హం. ఆ నలుగురు ఎవరనే విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు.

శివాజీరాజా, శ్రీకాంత్ ప్రెస్‌మీట్‌కు కౌంటర్‌‌గా నరేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ  తనకు కలిగిన సందేహాలను… అనుమానాలను చెప్పుకొచ్చారు. ‘మా’లో నిధుల గోలుమాల్ విషయంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని… ఈ కమిటీ వ్యవహారం ప్రభుత్వం చూడాలని, విశ్రాంత ఐపీఎస్ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మా’లో తాజాగా తలెత్తిన ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో అని సినీ అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.