ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలు!

21 May, 2019 - 8:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

క్రకౌ (పోలాండ్): పోలాండ్‌ దేశంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఆ శిశువుల్లో నలుగురు ఆడ బిడ్డలు కాగా.. ఇద్దరు మగశిశువులున్నారు. ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జన్మించడం పోలాండ్‌ దేశంలో ఇదే తొలిసారి. దక్షిణ పోలిస్ నగరమైన క్రకౌలోని యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆ మహిళ సోమవారం ఆరుగురు బిడ్డలకు జన్మనివ్వగా.. వారు ఒక్కొక్కరూ కిలో బరువు (2.2 పౌండ్లు) ఉన్నారు. దీంతో బిడ్డలను వైద్యులు ఇన్‌క్యూబెటర్లలో ఉంచారు. ప్రస్తుతం తల్లీ పిల్లలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 29 వారాల గర్భవతి అయిన ఆమెకు సిజేరియన్‌ చేసినట్లు యూనివర్సిటీ వైద్యులు పేర్కొన్నారు. ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనివ్వడం చాలా అరుదైన సంఘటన అని వారు వివరించారు.

ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించిన విషయం తెలుసుకున్న పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుడ ఆ దంపతులను ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘అబ్బురపరిచే వార్త.. పోలాండ్‌ దేశ చరిత్రలోనే తొలిసారి ఒకే కాన్పులో ఆరుగురు జన్మించడం. ఆ దంపతులకు అభినందనలు. వైద్యులకు ధన్యవాదాలు’ అని దుడ ట్వీట్‌ చేశారు. పైగా ముప్పై ఏళ్ళ లోపు వయసున్న ఆ మహిళకు అప్పటికే రెండేళ్ల బాలుడు ఉన్నాడు. రెండో కాన్పులో ఒకేసారి ఆరుగురికి ఆమె జన్మనివ్వడం విశేషం.

కాగా.. ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలు జన్మించడం ఇదే తొలిసారేం కాదు. ఏడుగురు చిన్నారులు ఒకే కాన్పులో జన్మించిన సందర్భాలున్నాయి. 1997లో అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో కెన్నీ, బాబి మెక్‌కాగ్ దంపతులు తొలిసారి ఒకే కాన్పులో ఏడుగురు శిశువులకు జన్మనిచ్చారు. అప్పట్లో ఈ దంపతులు అమెరికాలో ఎంతో ప్రాచుర్యం పొందారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆ దంపతులను పిలుపించుకుని స్వయంగా కలిశారు. ప్రముఖ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే కూడా తన షోకి ఈ దంపతులను ఆహ్వానించారు. మళ్లీ 22 ఏళ్ల తరవాత ఇరాక్‌లో ఏడుగురు శిశువులు ఒకే కాన్పులో జన్మించారు. 1983లో ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో గ్రహమ్‌ వాల్టన్‌, జనేట్‌ లీడ్‌ బెటర్‌ దంపతులు తొలిసారి ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చారు. ఈ పిల్లలు వాల్టన్‌ సెక్స్‌టుప్లెట్స్‌గా గుర్తింపు పొందారు.