సర్వీస్ 27 ఏళ్ళు.. బదిలీలు 52!

04 March, 2019 - 3:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చండీగఢ్‌: సిన్సియర్ అధికారులు కావాలని అందరం కోరుకుంటాం. అయితే.. అలాంటి సిన్సియర్ అధికారులు ప్రభుత్వాల నుంచి, రాజకీయ నాయకుల నుంచి పై అధికారుల నిత్యం ఎదుర్కొనే సమస్యల గురించి మాత్రం పట్టించుకోం. నిజానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు బదిలీలు సాధారణ విషయమే. కానీ ఈ సీనియర్ ఐఏఎస్‌ అధికారి సర్వీసులో చేరిన 27 ఏళ్ల కాలంలో 52 సార్లు బదిలీ అవడం గమనార్హం. నిజాయితీగా పనిచేస్తూ అవినీతిని బయటపెట్టడమే ఇన్న సార్లు ఆయన బదిలీ అవడానికి కారణం. ఆ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేరు అశోక్‌ ఖేమ్కా.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌‌కతాకు చెందిన అశోక్‌ 1991లో హర్యానా కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. విధుల్లో చేరినప్పటి నుంచీ నిజాయితీగా పనిచేస్తూ అనేక కుంభకోణాలను బయటపెట్టారాయన. దీంతో ఆయనకు బదిలీలు తప్పలేదు.

2012లో రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ, ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌‌కు జరిగిన భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో అశోక్‌ పేరు దేశంలో మార్మోగిపోయింది. ఆ తర్వాత కూడా అశోక్‌‌ అనేకసార్లు బదిలీ కావాల్సి వచ్చింది. కాగా.. 15 నెలల క్రితమే హర్యానా క్రీడల శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన అశోక్‌‌ను తాజాగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన 27 ఏళ్ల ఉద్యోగ సర్వీసు‌లో ఇది 52వ బదిలీ. అశోక్‌‌తో పాటు మరో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను కూడా హర్యానా ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది.