మళ్లీ నిజమైన దశాబ్దాల ఆనవాయితీ

15 May, 2018 - 11:58 AM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: సిరాహట్టి… కర్ణాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో జరిగిన ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో గెలిచారో ఆ అభ్యర్థిని నిలబెట్టిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ ఈసారి కూడా మరోసారి నిజమైంది. కన్నడనాట పాత సంప్రదాయాన్ని నిజం చేస్తూ.. సిరాహట్టిలో బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లమాని విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దొడ్డమణి రామకృష్ణ సిద్ లింగప్పపై రామప్ప విజయం సాధించారు.

2013లో జరిగిన ఎన్నికల్లో సోబెప్పపై సిద్ లింగప్ప విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు విజయలక్ష్మి వరించిన సోబెప్పను నిలబెట్టిన బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది. సిరాహట్టి పోలిక కాకతాళీయమే అయినా, కన్నడిగులతో పాటు దేశమంతా మరోసారి నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది.