‘మా’ అధ్యక్షుడిగా నరేష్ ఘన విజయం

11 March, 2019 - 10:36 AM

అత్యంత ఉత్కంఠ భరితంగా ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా) అధ్యక్షుడిగా సీనియర్‌ నటుడు నరేష్‌ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి శివాజీరాజాపై ఆయన గెలిచారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేష్‌కు 268 ఓట్లు వచ్చాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌‌గా శ్రీకాంత్‌ను ఓడించి రాజశేఖర్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌‌‌లుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా రఘుబాబుపై జీవిత రాజశేఖర్ గెలిచారు. జాయింట్ సెక్రటరీలుగా గౌతమ్ రాజు, శివబాలాజీ విజయం సాధించారు. ట్రెజరర్‌‌గా కోట శంకర్రావుపై రాజీవ్ కనకాల గెలుపొందారు.

గెలిచిన ‘మా’ ఈసీ మెంబర్లు వీరే:
అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేష్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్.ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ‘మా’ పాలకవర్గం ఎన్నికల పోలింగ్ జరిగింది. మా అసోషియేషన్‌‌లో మొత్తం 745 మంది సభ్యులు ఉండగా 472 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో నటులు నరేశ్‌, శివాజీ రాజా నేతృత్వాల్లోని ప్యానళ్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ‘మా’ ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి.

సినీరంగానికి చెందిన ప్రముఖులంతా ఫిల్మ్‌‌చాంబర్‌‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా.. ఈ సారి పోలింగ్‌‌కు బ్యాలెట్‌ పత్రాలు వినియోగించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.