నంద్యాల ఫలితంలో పరమార్ధం

29 August, 2017 - 2:58 PM

అక్కడొకటి అక్కడొకటిగా జరిగిన ఉపఎన్నికలు యావత్ దేశం దృష్టినీ ఆకర్షించడం చాలా అరుదు. మొన్నటి ఉపఎన్నికలకు అలాంటి ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా ఢిల్లీలో ఒక శాసనసభ సీటుకీ, ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల సీటుకూ జరిగిన ఉపఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఢిల్లీలో ఫలితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పరువు నిలబెట్టింది. ఇక నంద్యాల ఫలితం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అమితమైన ఉత్సాహాన్ని నింపింది. అందుకు తగిన కారణం లేకపోలేదు.

సాధారణంగా ఉపఎన్నికల ఫలితాలు అధికారపక్షానికి అనుకూలంగా ఉండడం కద్దు. ఆవిధంగా చూస్తే నంద్యాల ఫలితానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే అటు అధికారపక్షం ఇటు ప్రతిపక్షం కలిసి ఆ ఉపఎన్నికను ప్రతిష్టాత్మక పోరుగా మార్చాయి. నిజానికి ఇందుకు ఎక్కువ బాధ్యత ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డిదే. ఒక్కటంటే ఒక్క శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికను చంద్రబాబు పాలనపై రిఫరెండంగా అభివర్ణించి ఆయన నంద్యాల పోరు స్వభావాన్ని మార్చేశారు.

రాయలసీమలో, అందునా 2014 ఎన్నికలలో తన పార్టీ పక్షాన నిలిచిన నంద్యాలలో ఉపఎన్నిక ఫలితం తనకు గాక ఎవరికి అనుకూలంగా ఉంటుందిలే అన్న ధీమా ఆయనతో ఆ మాట అనిపించి ఉండొచ్చు. అయితే పొరపాటున ఫలితం తారుమారయితే పరిస్థితి ఏమిటన్న అంచనా లేకపోవడం జగన్‌ను దెబ్బ తీసింది. రాజకీయవేత్తగా జగన్‌లో పరిపక్వత లేని సంగతి నిరూపణ కావడం ఇదేం మొదటిసారి కాదు.
కానీ ఇది అన్ని సందర్భాల లాటింది కాదు. నంద్యాలలో ఓడిపోతే వైఎస్‌ఆర్‌సిపి కోల్పోయేది చాలా ఉంది. ఒకసారి ఉపఎన్నికను ఆ స్థాయికి తీసుకువెళ్లిన తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆ పార్టీకి అవగాహన ఉన్నట్లు లేదు. రాయలసీమలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. సంప్రదాయబద్ధంగా వారు కాంగ్రెస్‌కు అనుకూలం. వైఎస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన 2004 ఎన్నికలలో, ఆ తర్వాత 2009 ఎన్నికలలో కూడా మెజారిటీ ముస్లింలు కాంగ్రెస్ పక్షానే నిలిచారు.

వైఎస్ అకాల మరణం తర్వాత నాలుగేళ్లకు వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో ముస్లిం ఓటర్ల మద్దతు వైఎస్‌ఆర్‌సిపికి గట్టిగా లభించింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ ఉనికి నామమాత్రంగా తయారుకావడం, వైఎస్ మృతి తెచ్చిపెట్టిన సానుభూతి ఇదుకు కారణం. ఆ ఎన్నికలలో అనంతపురం మినహా మిగతా మూడు రాయలసీమ జిల్లాలలో వైఎస్‌ఆర్‌సిపికి తిరుగులేని ఆధిక్యత లభించింది.
2014 ఎన్నికలలో విజయం సాధించిన బిజెపి, కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి కూడా అధికారంలో వాటా ఇచ్చింది. బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడం ఇది రెండవసారి. మోదీ పాలనలో దళితులు, మైనారిటీలు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి బిజెపితో అంటకాగుతున్న పార్టీలకు ఆ వర్గాల మద్దతు లభించడం కష్టమన్న భావన తర్వత్రా నెలకొని ఉంది.

ఆ ప్రకారం చూస్తే నంద్యాలలో ముస్లిం ఓట్లు అధికారపక్షానికి లభించకూడదు. ఆ భయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఉంది. అందుకే ఆయన రాష్ట్రంలో తమతో అధికారం పంచుకుంటున్న బిజెపి నాయకులను మాటవరసకు కూడా నంద్యాల ప్రచారానికి పిలవలేదు. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదని నంద్యాల ఫలితం తేల్చింది. టిడిపికి సంబంధించినంతవరకూ గెలుపు తెచ్చిపెట్టే సంతోషం కన్నా ఇది ముఖ్యమైన విషయం.

ఈ పరిణామాన్ని రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు, ప్రధానంగా రాయలసీమ ముస్లింలు, ఎన్‌డిఎ పాలనలో మైనారిటీల పరిస్థితి గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నది మొదటిది. మొదటి నుంచీ కాంగ్రెస్‌కు, విభజన అనంతర రాజకీయాలలో వైఎస్‌ఆర్‌సిపికి లభిస్తూ వచ్చిన ముస్లింల మద్దతు ఇప్పుడు గణనీయమైన స్థాయిలో టిడిపి వైపు మళ్లిందన్నది రెండవది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, పార్టీ శ్రేణులకూ గెలుపును మించిన సంతోషం కలిగించే విషయం అన్నది ఇదే.
నిజానికి నంద్యాల ఉపఎన్నిక ముందు చెప్పుకోదగిన ఎజెండా ఏమీ లేదు.

ఎన్నికల ప్రణాళిక అమలులో బాబు వైఫల్యాలంటూ జగన్ ఒక ఎజెండా సృష్టించారు. ఆయన ప్రచారమంతా చంద్రబాబుపై వ్యక్తిగత దాడిగా సాగింది. రోజా లాంటి స్టార్ కాంపైనర్ల ప్రచారం కూడా ఆ దారిలోనే నడిచింది. జగన్ వ్యూహాత్మక తప్పిదాల్లో ఇది రెండవది. ఓటర్ల తీర్పు అధికారపక్షానికి అనుకూలంగా రావడంతో ప్రభుత్వ విధానాలకూ, చంద్రబాబు నాయకత్వానికీ ప్రజల మద్దతు లభించినట్లయింది.

                                – ఆలపాటి సురేశ్ కుమార్