శశికళ గదిలో ‘రహస్య లేఖ’!

13 January, 2018 - 9:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: జయలలిత మరణించిన తర్వాత పొయెస్ గార్డెన్‌‌లోని ఆమె ఇంటికి చేరిన శశికళ ఒక గదిని ఆక్రమించుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లే వరకు ఆ గదిలోనే ఉన్నారు. ఇప్పుడా గదిలో ప్రభుత్వానికి తాము రాసిన అత్యంత రహస్య లేఖ ఒకటి లభ్యమైందని ఆదాయపన్ను అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుట్కా స్కామ్ నిందితులపై చర్యలు తీసుకోవాలని రాసిన రహస్య లేఖ శశికళ గదిలో లభ్యం కావడం గమనార్హం.

గుట్కా కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే ఎమ్మెల్యే జె.అంబగళన్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. దానికి స్పందిస్తూ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ సుసీ బాబు వర్గీస్ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌‌లో ఈ లేఖ విషయం వెల్లడించారు. గుట్కా కుంభకోణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు అత్యున్నత స్థాయి అధికారులు, పోలీసుల పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో అప్పటి ఐటీ విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ 2016 ఆగస్టు 11న తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్‌కి లేఖ రాశారు. సీజ్ చేసిన గుట్కాలకు సంబంధించిన సమాచారం వారి వద్ద ఉన్నట్టు అందులో పేర్కొన్నారు.

కాగా.. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే అని ఆ లేఖలో ఉన్నట్టు తాజాగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. 2017 నవంబర్ 17న వేదనిలయంలోని శశికళ గదుల్లో నిర్వహించిన సోదాల్లో 2016 సెప్టెంబర్ 2 తేదీతో అప్పటి డీజీపీ సంతకంతో అప్పటి సీఎం జయలలితకు పంపిన రహస్య ఐటీ లేఖ దొరికింది.