మీడియాకు సైన్స్ అక్షరాస్యత

14 November, 2017 - 12:18 AM

♦ మీడియా పల్స్

Why we need science in a liberal arts education అనే శీర్షికతో ఒక వ్యాసం డెక్కన్ క్రానికల్‌లో కనబడింది. అది నవంబర్ 10 శుక్రవారం – ప్రపంచ సైన్స్ దినోత్సవం. నిజానికి ఈ వ్యాసానికీ, ఆ సందర్భానికీ లంకె లేకపోయి ఉండొచ్చు. కానీ మాళవికా సర్కార్ రాసిన ఈ ఆంగ్ల వ్యాసం చాలా చక్కగా తర్కబద్ధంగా సాగింది. ఇటువంటి విశ్లేషణలు తరచూ ఎందుకు కనబడడం లేదన్న ప్రశ్న కూడా ఎదురయింది. మన జ్ఞానాన్ని విభజించుకున్న వేళ స్ఫురించని కోణాలు ఇలాంటి వాటిలో కనబడతాయి. మానవ సమాజ పరిణామంలో సంభవించిన ఆవిష్కరణల పర్భావాలు కూడా అదనంగా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు మన దృష్టిలోకి వస్తాయి. కీలకమైనవిగా మారినపుడు లేదా అభిప్రాయనేతలు వీటిని గుర్తించి ముందుకు తెచ్చి చర్చకు నిలిపినపుడు కీలకమవుతాయి.

 ఇలా ఆలోచిస్తూ పేపర్లు తిరగేస్తూంటే Evolution అనే ఒక పేజీ శీర్షిక ఎక్స్‌ప్రెస్‌లో కనబడింది. కాస్త గమనించగానే అది సైన్స్‌కు సంబంధించిన ప్రయత్నంగా బోధపడింది. శాంతియుతమైన, సుస్థిరమైన సమాజ నిర్మాణం కోసం విజ్ఞానశాస్త్ర అవగాహన పెంపొందించడం, దేశాల మధ్య విజ్ఞానశాస్త్ర పరమైన ఆదానప్రదానాలను బలోపేతం చేయడం;సమాజం కోసం పాటుపడే వైజ్ఞానిక తపనను దేశాల లోపల, దేశాల మధ్య పెంపొందించడం; అలాగే సైన్స్‌కు ఎదురయ్యే అవరోధాల గురించి అప్రమత్తం చేసి వైజ్ఞానిక ప్రయత్నాన్ని ప్రోత్సహించడం వంటివి ఈ శాంతి, అభివృద్ధి కోసం నిర్దేశించిన ప్రపంచ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ప్రాధాన్యతలు. ఈ ఆలోచనను యునెస్కో దేశాలు 2001లో ప్రతిపాదించి 2002 నుండి ఈ సందర్భాన్ని జరుపుకుంటున్నాయి.

తెలుగు పత్రికలలో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలు పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రభలో సంపాదకీయపుటలో ‘సైన్స్‌తోటే ప్రపంచం ఏకం’ అనే వ్యాసం కనబడింది. డాక్టర్ పోడు భగత్ కుమార్ రాసిన వ్యాసం చిన్నదైనా చక్కగా ఉంది.

కానీ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలకు ఈ సందర్భం స్ఫురించకపోవడం గురించి మనం చింతించాలి. దశాబ్దం క్రితం దాకా దాదాపు అన్ని తెలుగు పత్రికలు సంపాదకీయ పుటలో ఒక సైన్స్ అంశాన్ని క్రమం తప్పకుండా ప్రచురించేవి. నేడు ఆ ధోరణి మాయమైంది. సాక్షి ఫ్యామిలి పేజీల్లో   ‘నాన్నా చెప్పవా’ అనే శీర్షికలో ఒక చిన్న విశేషాన్ని హాయిగా అర్థమయ్యేలా ప్రచురించేవారు. ఫ్యామిలి మూడు పేజీలకు తగ్గించినపుడు కోతకు గురైన శీర్షిక ఇది. దీన్ని మరలా పునఃప్రారంభించాల్సి ఉంది.

ఒకప్పుడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకంగా రాయించిన సైన్స్ పేజీ తర్వాత సైన్స్ ఎక్స్‌ప్రెస్ అనుబంధం ఎంతో గౌరవం కల్గి ఉండేవి. వార్తాసంస్థలు ఇచ్చిన అంశాలను పేర్చడం కన్నా, పాఠకుల అభిరుచి స్థాయికి తగిన రీతిలో అందించడం మెరుగయిందే! ఇపుడు హిందూ పత్రిక, ఎక్స్‌ప్రెస్ పత్రిక సైన్స్ అనుబంధాలు ప్రచురించడం మానివేశాయి. ఒక సంవత్సరం క్రితం హన్స్ ఇండియా SCIENCE 4 U అనే పేజీలో స్థానికంగా పరిశోధనాలయాలలో జరిగే విశేషాలు ప్రచురించాలని ప్రయత్నించింది. ఈ విషయం అప్పటి ఎడిటర్ కె నాగేశ్వర్ వివరించారు కూడా. అయితే అది క్రమంగా ఇతర దేశాల సైన్స్ విషయాలు ఇవ్వడం ప్రారంభించి, కొన్ని నెలలకు ఆ పేజీని రద్దు చేసింది.

Technomics అనే పేరుతో క్రానికల్ టెక్నాలజీ విషయాలు వాణిజ్య కోణం కలిగి ఉన్నవి ఇస్తోంది. తెలుగు పత్రికల్లో కూడా వాణిజ్య సమాచారం ఇచ్చే పుటలో ఇలాంటి వార్తలు కొన్ని ఇస్తున్నారు. హిందూపత్రిక ఒక సైన్స్ పేజీని ఆదివారం ఇస్తోంది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒకటి, రెండు సంవత్సరాలుగా XPLORE అని చివరి పేజీని ప్రత్యేకంగా అలంకరిస్తోంది. ఇందులో ఆరోగ్యకోణం, వాణిజ్యకోణం ఉన్నా చాలా సైన్స్ సంగతులు ప్రతిరోజూ ప్రచురిస్తోంది. చాలా స్థిరంగా నడుస్తున్న శీర్షికిది.

నిజానికి లోపలి పేజీలో మొదలై, క్రమంగా చివరి పేజీలో రంగులలో స్థిరపడింది. హన్స్ ఇండియా కూడా దాదాపు అదే పేరుతో అలాంటి ప్రయత్నం అడపాదడపా చేస్తోంది.

పత్రికల్లో సైన్స్ విషయాలకు ఆదరణ లేదనే ప్రచారం ఒకటి బలంగా ఉంది. అలాగే సైన్స్ విషయాలను స్థానిక భాషలలో వ్రాయాలంటే మరింత సామర్థ్యం ఉండాలి. అటువంటి సామర్థ్యాలున్నవారు లభించే ఈ జీతాలతో తృప్తిపడరు. ఈ రెండు ప్రధాన కారణాలు-ప్రధానమైనవి. సైన్స్‌కున్న ప్రాధాన్యతను కమిట్‌మెంట్‌గా గల సంపాదకులు స్థిరపడిన పెద్ద పత్రికలలో అవకాశం పొందితే-సైన్స్ జర్నలిజం కూడా కీలకమవుతుంది. సైన్స్ రచనలు ఆసక్తికరంగా మారే శిల్పం, పరిశోధన ఏర్పడుతుంది. కనుక సైన్స్ అక్షరాస్యత సంపాదకుల నుంచి బయలుదేరాలి! యాజమాన్యాలలో బలపడాలి!!

  • – డా. నాగసూరి వేణుగోపాల్

    మీడియా విశ్లేషకులు