సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుల పునర్విచారణ

10 January, 2018 - 5:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల కేసులపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మూసివేసిన 241 కేసులకు గాను 186 కేసులను పునర్విచారించేందుకు కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేృత్వంలో ఈ కేసులను మరోసారి దర్యాప్తు చేయించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం బుధవారం వెల్లడించింది. ఈ సిట్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు కోర్టు తెలిపింది.

దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో దాదాపు 2,733 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ నేతలు జగ్దీష్ టైట్లర్, సజ్జన్ కుమార్ అల్లర్లకు దారితీశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అల్లర్లపై విచారణకు 2015లో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు విచారణ చేసిన సిట్ 2017లో 241 కేసులను మూసివేసింది.

సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మొత్తం 293 కేసులను పరిశీలించేందుకు గత ఏడాది ఆగస్టులో సుప్రీం కోర్టు ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులు  జేఎం పంచల్‌, కేపీఎస్‌ రాధాకృష్ణన్‌‌లో కూడిన ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. అయితే 241 కేసుల్లో 186 కేసులను సిట్ ఎలాంటి విచారణ చేపట్టకుండానే మూసివేసిందని సుప్రీం కోర్టుకు రిటైర్డ్‌ జడ్డీల ప్యానల్ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ కేసుల పునర్విచారణపై ఆదేశాలు జారీ చేసింది.