అభిప్రాయ భేదాలు సమసిపోతాయ్

13 January, 2018 - 7:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు త్వరలోనే సమసిపోతాయని, ఈ అంశం అంతర్గతంగానే పరిష్కారం అవుతుందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చలమేశ్వర్, కురియన్ జోసఫ్, మదన్ బి లోకూర్, రంజన్ గొగోయ్‌‌లు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీజేఐ దీపక్ మిశ్రాపైనా, సుప్రీంకోర్టు పాలనా విధానాలపైనా ఆరోపణలు చేసిన మరుసటి రోజు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చింది.

బార్ కౌన్సిల్ సభ్యులు శనివారం సమావేశమైన అనంతరం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మనన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు లేవనెత్తిన అంశాన్ని వివాద కోణం నుంచి ఎంతమాత్రం చూడవద్దని కోరారు. ఈ విభేదాలు అంతర్గతంగానే పరిష్కారం అవుతాయని చెప్పారు. బార్ కౌన్సిల్ నుంచి ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులను కలుసుకుని వారి అభిప్రాయాలు వినాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ అంశాన్ని పరిష్కరించాలని కౌన్సిల్ కోరుకుంటోందన్నారు.

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారమని, దానిలో జోక్యం చేసుకోబోమని ప్రధాని, న్యాయశాఖ మంత్రి చెప్పడాన్ని మిశ్రా స్వాగతిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. ‘న్యాయ వ్యవస్థపై మాట్లాడే అవకాశాన్ని రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ పార్టీలకు కల్పించింది మనమే. ఆయనకు (రాహుల్), ఇతర రాజకీయ పార్టీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశాన్ని దయచేసి రాజకీయం చేయవద్దు’ అని మనన్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు.

అదే విధంగా మరోసారి మీడియా ముందుకు వెళ్లవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా మనన్ కుమార్ మిశ్రా కోరారు. ప్రజల ముందుకు న్యాయమూర్తులు వెళ్లి ఉండాల్సింది కాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించుకునేందుకు తగిన యంత్రాంగం న్యాయవ్యవస్థ పరిధిలోనే ఉందని, ఆ స్ఫూర్తితో చర్చించుకుని పరిష్కరించుకోవాలని మనన్ కుమార్ మిశ్రా సూచించారు. మరోసారి ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వవద్దని కౌన్సిల్ తరఫున మనన్ కుమార్ మిశ్రా విజ్ఞప్తి చేశారు.