గూఢచర్యం కేసులో ఇస్రో మాజీ సైంటిస్టుకు ఊరట..!

14 September, 2018 - 4:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ (76)కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో కేరళ పోలీసులు నారాయణన్‌ను అనవసరంగా అరెస్టు చేసి, బాధపెట్టి, మానసిక వేధింపులకు గురిచేశారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అందు కోసం ఆయనకు రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని పోలీసులను ఆదేశించింది. కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తు చేసేందుకు మాజీ న్యాయమూర్తి డికె జైన్ నేతృత్వంలో జస్టిస్ ఎఎన్ ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్‌‌తో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

నంబి నారాయణన్‌ 1991లో ఇస్రో క్రయోజెనిక్ టెక్నాలజీ అభివృద్ధి ప్రాజెక్టు డెరైక్టర్‌‌గా పనిచేశారు. ఇస్రో అంతరిక్ష కార్యక్రమ వివరాలను అమ్ముకున్నారనే ఆరోపణపై 1994లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 1998లో సుప్రీంకోర్టు నారాయణన్‌పై కేసును కొట్టివేసింది. నారాయణన్, శశికుమరన్‌‌ను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో పాటు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మాజీ డీజీపీ మాథ్యూ, ఇద్దరు రిటైర్డ్ సూపరింటెండెంట్లు కె.కె. జాషువా, ఎస్.విజయన్‌‌లు అక్రమ కేసులతో తనను మానసిక వేదన, హింసకు గురిచేశారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ నారాయణన్‌ ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సీలో పిటిషన్‌ వేశారు. కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 1998 సుప్రీంతీర్పును పరిగణనలోకి తీసుకున్న ఎన్‌‌హెచ్‌ఆర్‌‌సీ వాదనల అనంతరం 2001 మార్చిలో నారాయణన్‌‌కు రూ.10 లక్షల తాత్కాలిక పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. దీన్ని కేరళ హైకోర్టు కూడా సమర్ధించింది.

అయితే.. 2015లో పోలీసు ఉన్నతాధికారులపై క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ నారాయణన్‌ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. 1994లో ఇస్రో గూఢచర్యం కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నించిన పోలీసు ఉన్నతాధికారులను విచారించాలని నారాయణన్‌ పెట్టుకున్న పిటిషన్‌‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. 1994 అక్టోబర్‌ 20న మాల్దీవులకు చెందిన మహిళ మరియం రషీదాను పోలీసులు అరెస్టు చేశారు. గడువు ముగిసినప్పటికీ భారతదేశంలో ఉంటున్నందుకు ఆమెను అరెస్ట్‌ చేయడంతో పాటు సెక్స్‌- స్పై కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆరోపణలు చేశారు. శాస్త్రవేత్త నారాయణన్‌ పేరును మరియం రషీదా చెప్పడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు మహిళలు, ఇస్రో మధ్య రషీదా మధ్యవర్తిత్వం నడిపిందని, ఇస్రోకు చెందిన క్రయోజనిక్‌ రహస్యాలను సేకరించి వారికి చెప్పేదని పోలీసులు ఆరోపణలు చేశారు. ఆ రహస్యాలను వారు రష్యా, పాకిస్తాన్‌ ఐఎస్‌ఎస్‌లకు చేర్చేవారని చెప్పారు. అయితే రెండేళ్ల అనంతరం ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న సీబీఐ ఆ ఆరోపణలను కొట్టివేసింది. నంబి నారాయణన్‌‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ ఈ కేసును మూసివేస్తున్నట్లు సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించింది. దీంతో వీరు 1996 మేలో విడుదలయ్యారు. ఈ కేసులో పోలీసులు అక్రమ మార్గాలను ఎంచుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ సిఫారసు చేసింది.