ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలన్స్ చార్జీల తగ్గింపు

13 March, 2018 - 4:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌‌బీఐ) తన ఖాతాదారులకు గుడ్‌‌న్యూస్‌ చెప్పింది. పొదుపు ఖాతాల్లో నెలవారీ కనీస నిల్వలు లేకపోతే వసూలుచేసే చార్జీలను 75 శాతం వరకు తగ్గించింది. ఈ విధానం 2018 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ తగ్గింపుతో దాదాపు 25 కోట్ల మంది బ్యాంకు కస్టమర్లు ప్రయోజనం పొందనున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని ఎస్‌బీఐ పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేని ఖాతాదారుల నుంచి నెలకు రూ. 50 (జీఎస్‌టీ కాకుండా) చొప్పున, సెమీ- అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారుల నుంచి నెలకు రూ. 40 (జీఎస్‌టీ కాకుండా) వసూలు చేస్తోంది. తాజాగా ఈ చార్జీలను భారీగా తగ్గించింది.
చార్జీల తగ్గింపు కారణంగా ఇకపై మెట్రో, అర్బన్‌ కేంద్రాల్లోని పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే రూ. 15 (జీఎస్‌‌టీ కాకుండా) చొప్పున, సెమీ-అర్బన్‌ అయితే రూ. 12 (జీఎస్‌టీ కాకుండా), గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాలకు రూ. 10 (జీఎస్‌‌టీ లేకుండా) చొప్పున వసూలు చేయనున్నట్లు ఎస్‌‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మెట్రో, అర్బన్‌ ప్రాంతాల సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచాల్సిన కనీస మొత్తం 3 వేల రూపాయలు.

కనీస నిల్వలపై చార్జీల పేరుతో ఎస్‌‌బీఐ రూ.వేల కోట్ల ఆదాయాన్ని గడిస్తోందంటూ ఇటీవల దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చార్జీల ద్వారా కేవలం ఎనిమిది నెలల్లోనే ఎస్‌బీఐ రూ. 1,771 కోట్లు గడించిందంటూ కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో చార్జీలను తగ్గిస్తూ ఎస్‌‌బీఐ తాజాగా నిర్ణయం తీసుకోవడం విశేషం.

కాగా.. ఈ చార్జీలను తగ్గించడంతో పాటు ఎలాంటి చార్జీలూ లేకుండా రెగ్యులర్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌‌ను బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్‌‌గా మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. దీంతో కస్టమర్లు మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీల నుంచి ఉపశమనం పొందుతారు. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు అకౌంట్లపై బ్యాంకు ఈ మినిమమ్‌ బ్యాలెన్స్‌‌ చార్జీలను విధించడం లేదు.

కస్టమర్ల సెంటిమెంట్లు, ఫీడ్‌‌బ్యాక్‌‌ల అనంతరం చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎస్‌‌బీఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎండీ పీకే గుప్తా తెలిపారు. కస్టమర్ల ప్రయోజనాలకే బ్యాంకు ముందుగా ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఎస్‌‌బీఐ వద్ద 41 కోట్ల సేవింగ్స్‌ అకౌంట్లు ఉండగా.. పెన్షనర్లు, మైనర్లు, సోషల్‌ సెక్యూరిటీ బెనిఫిట్‌ హోల్డర్ల పీఎంజేడీవై, బీఎస్‌‌బీడీ అకౌంట్లు 16 కోట్లు ఉన్నాయి. 21 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న అకౌంట్ హోల్డర్లకు కూడా మినిమమ్‌ చార్జీల నిబంధనను బ్యాంకు వర్తింపచేయడం లేదు.