ఆ బ్యాంకుల ఏటీఎంల్లో ఎంత డ్రా చేసుకోవచ్చు అంటే…

11 October, 2018 - 2:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవల తన ఖాతాదారులు ఏటీఎం నుంచి ఒక్క రోజులో డ్రా చేసుకునే మొత్తాన్ని తగ్గించిన సంగంతి తెలిసిందే. ఈ నిబంధనలు ఎస్‌బీఐ క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులకు వర్తిస్తాయి. అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధికంగా రూ. 40 వేలు వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎస్‌బీఐ కొత్త నిబంధనతో ఈ మొత్తాన్ని రూ. 20 వేలకు తగ్గించింది. ఎస్‌బీఐ గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు కింద రూ. 50 వేలు, ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుదారులు రూ. లక్ష వరకు డ్రా చేసుకోవచ్చు. అలాగే ప్రధాన బ్యాంకుల ఖాతాదారులు ఏటీఎంల ద్వారా ఒక్క రోజులో ఎంత డ్రా చేసుకోవచ్చు అంటే..

ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రతి వినియోగదారుడు ఏటీఎం నుంచి ఒక్క రోజులో రూ.50 వేలు వరకు డ్రా చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రివిలేజ్‌ బ్యాంకింగ్‌ టైటానియం డెబిట్‌ కార్డుదారులు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. స్మార్ట్‌ షాపర్స్‌ గోల్డ్‌ డెబిట్‌ కార్డుదారులు రూ.75 వేలు… స్మార్ట్‌ షాపర్స్‌ సిల్వర్‌ కార్డుదారులు రూ.50 వేలు డ్రా చేసుకొనే అవకాశం ఉంది.

అలాగే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) క్లాసిక్‌, ప్లాటినం డెబిట్‌ కార్డులను జారీ చేస్తోంది. ఖాతాదారుల అవసరాలను బట్టి రూపే, మాస్టర్‌ విభాగాల్లో అందిస్తోంది. ప్లాటినం కార్డుదారులు రోజుకు రూ. 50 వేలు, క్లాసిక్‌ కార్డు దారులు రోజుకు రూ.25 వేలు డ్రా చేసుకోవచ్చు.

యాక్సిస్‌ బ్యాంక్‌ బుర్గుండీ డెబిట్‌ కార్డుపై రోజుకు రూ.3 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు. టైటానియం ప్రీమియం, ప్లస్‌ డెబిట్‌ కార్డుల నుంచి రోజుకు రూ.50 వేలు వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

బ్యాంక్‌ ప్లాటినమ్‌ చిప్‌ డెబిట్‌ కార్డు నుంచి రోజుకు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. టైటానియం రాయల్‌ డెబిట్‌ కార్డుదారులు రూ.75 వేలు, ఈజీ షాప్‌ డెబిట్‌ కార్డుపై రూ.25 వేలు, రూపే ప్రీమియం డెబిట్‌కార్డుపై రూ.25 వేలు, ఈజీషాప్‌ టైటానియం డెబిట్‌ కార్డుపై రూ.50 వేలు వరకు డ్రా చేసుకోనే అవకాశం ఉంది.

బ్యాంక్‌ బరోడా రూపే క్లాసిక్‌ కార్డుపై రోజుకు రూ. 25 వేలు వరకు డ్రా చేసుకోవచ్చు. బరోడా మాస్టర్‌ ప్లాటినం కార్డుపై రూ.50 వేలు, రూపే ప్లాటినం కార్డుపై రూ.50 వేలు, వీసా ఎలక్ట్రాన్‌ కార్డుపై రూ.25 వేలు మాస్టర్‌ క్లాసిక్‌ కార్డుపై రూ.25 వేలు, వీసా ప్లాటినం చిప్‌ కార్డుపై రోజుకు రూ.లక్ష వరకు విత్‌ డ్రా చేసుకోవచ్చు.