శశికళ ఎగ్గొట్టిన ఐటీ రూ.5 వేల కోట్లు!

14 January, 2018 - 2:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ ఎగ్గొట్టిన ఆదాయపు పన్ను మొత్తాన్ని లెక్కగడుతున్న ఇన్‌కం ట్యాక్స్ అధికారులే నోరెళ్ళబెడుతున్నారు. ఆమె ఎగ్గొట్టిన ఆదాయపు పన్ను మొత్తం రూ. 5 వేల కోట్లకు పైమాటే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శశికళ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇన్‌‌కంట్యాక్స్ అధికారులు ఏకకాలంలో భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. ఆ సోదాలకు సంబంధించిన ప్రకంపనలు నెలల తరువాత ఇప్పుడు కనిపిస్తున్నాయి. దొరికిన ఆధారాల మేరకు దర్యాప్తు జరుపుతున్న ఆదాయపు పన్ను అధికారులకు తవ్వేకొద్దీ శశికళ అక్రమ ఆస్తుల చిట్టా వెలుగులోకి వస్తూనే ఉండడం గమనార్హం.

శశికళ కుటుంబాన్ని లక్ష్యంగా గత ఏడాది నవంబర్ 9న ఏకకాలంలో పలు చోట్ల ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రాంతాల్లో ఈ సోదాలు జరగ్గా అందులో చెన్నైలోనే 115 ప్రాంతాలు ఉన్నాయి. 13వ తేదీ వరకు అయిదు రోజులు జరిగిన ఈ సోదాల్లో రూ.1,450 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత జయలలిత నివాసమైన పొయెస్‌‌గార్డెన్‌‌లోని వేదనిలయంలో సోదాలు జరిపి కంప్యూటరు హార్డ్‌ డిస్క్‌‌లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 20 పైగా డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి వాటి ద్వారా రూ.కోట్లలో నగదు బదలాయింపులు జరిగిన ఆధారాలను కూడా ఐటీ అధికారులు అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

ఈ పత్రాల ఆధారంగానే వివేక్‌, కృష్ణప్రియ, షకీల, పూంగుండ్రన్‌ తదితరులను ఆదాయపు పన్ను అధికారులు విచారిస్తున్నారు. జయలలిత నివాసంలో స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా పలు కీలక సమాచారం లభించినట్లు సమాచారం. శశికళ, ఇళవరసి, బంధువు కలియ పెరుమాళ్‌ పేరిట చాలా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు పన్ను ఎగవేత రూ.4,600 కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు తేల్చారట.

ఇంకా లెక్కల్లోకి రాని అనేక ఆస్తులు, ఇతర పెట్టుబడులు కూడా ఈ దాడుల సందర్భంగా వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే మరిన్ని అక్రమాస్తులు, పన్ను ఎగవేత వ్యవహారాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.