పల్లె బాటపట్టిన నగరవాసులు..బోసిపోతున్న భాగ్యనగరం!

13 January, 2018 - 9:38 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: సంక్రాంతి పండుగ కోసం భాగ్యనగర నగరవాసులు పల్లెకు తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్ మహానగరం దాదాపు ఖాళీ అయింది. సంక్రాంతికి నగరంలోని జనం సొంత ఊళ్లకు తరలి వెళ్తుండటంతో భాగ్యనగరం బోసిపోయి కనిపిస్తోంది. తెల్లవారుజామునుంచే ట్రాఫిక్ తో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసికనిపిస్తున్నాయి. రెగ్యులర్‌ రైళ్లు, బస్సులు, ప్రత్యేక రైళ్లు, బస్సులు రెట్టింపు ప్రయాణికులతో బయలుదేరుతున్నాయి. సికింద్రాబాద్ తోపాటు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

ఊళ్లకు వెళ్లే వారితో గత వారం రోజులుగా కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు శుక్రవారం జాతరను తలపించాయి. పండుగ సమయం దగ్గరపడడంతో ఇళ్లకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడుస్తున్న 3500 రెగ్యులర్ బస్సులకు అదనంగా మరో 3650 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతున్నప్పటికీ సరిపోవడంలేదు. కొందరు పండుగ రద్దీని తట్టుకోలేక సొంత వాహనాలను ఆశ్రయించారు. గత నాలుగు రోజుల నుంచి ఇప్పటి వరకు 15 లక్షలమందికి పైగా పల్లె బాట పట్టారు. మరో ఐదు లక్షలమంది సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంది.

పండుగకు ఊరెళ్లే వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎన్నడూ లేనంత రద్దీగా మారింది. రైళ్ల కోసం గంటలతరబడి వేచి చూశారు. శుక్రవారం స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు అన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. రైలు కనిపిస్తే పరుగులు పెట్టారు. పండుగ రద్దీని తట్టుకునేందుకు అధికారులు ప్రకటించిన ప్రత్యేక రైళ్లు కూడా నిండిపోయాయి. సీటు కాదు కదా, ఏదో రకంగా రైలులోకి ఎక్కి నిలబడితే చాలు.. అన్న పరిస్థితి కనిపించింది. శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైళ్లు అన్నీ దాదాపు గంట ఆలస్యంగా నడిచాయి.
సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ రైళ్లకు అదనంగా దక్షిణమధ్య రైల్వే మరో 50 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో టికెట్‌పై 50 శాతం అదనంగా వసూలు చేస్తుండగా, ప్రైవేటు ఆపరేటర్లు ఇదే అదునుగా దోపిడీకి తెరదీశారు. టికెట్‌పై మూడింతలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు.

మరోవైపు సొంత వాహనాలు, ట్రావెల్స్‌ కార్లు, ఇతర రకాల వాహనాల్లో సైతం భారీ సంఖ్యలో ఊళ్లకు బయలుదేరి వెళ్తుండటంతో టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులుతీరుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో నగర ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయరహదారిపై శనివారం వేకువజామున భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలో మీటరు మేర వాహనాలు నలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద పది గేట్లు తెరిచినా వాహనాల రద్దీ తగ్గలేదు.

ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లన్నీ బుకింగ్ అయ్యాయి. దూరప్రాంత రెగ్యులర్ రైళ్లలో రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో పాటు అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేకరైళ్లలో సీట్లు నిండిపోయాయి. వీటిలో చాలారైళ్లలో వెయిటింగ్ లిస్ట్ పరిమితి కూడా దాటిపోయింది. బెర్తు, సీటు దొరక్కపోయినా.. నిల్చొనైనా వెళ్దామనుకున్నా టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడమెలా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.