రికార్డుల మీద రికార్డులు

24 November, 2019 - 11:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం అల.. వైకుంఠపురంలో… . ఈ చిత్రంలోని సామజవరగమన… గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ గీతం య్యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ గీతం మిలియన్ లైక్స్ సాధించి కొత్త చరిత్రను సృష్టించింది.

టాలీవుడ్‌లో ఓ చిత్ర గీతానికి ఇన్ని లైక్స్ రావడం విశేషం. ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో వీక్షించిన వారి సంఖ్య 100 మిలియన్ల చేరువలో ఉండగా…  లైక్స్ కూడా మిలియన్‌కి చేరడం విశేషం.  ఈ పాటకి  సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించగా… సిద్ద్ శ్రీరామ్ ఆలపించారు. అలాగే ఈ పాటకు ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు.

సంక్రాంత్రి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. హరికా అండ్ హసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెకిస్తున్నాయి. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో టాబు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా కాలం తర్వాత టాబు నటిస్తున్న టాలీవుడ్ చిత్రం ఇది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ముచ్చటగా మూడో చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల.. వైకుంఠపురం చిత్రంపై కూడా స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.