‘దేవుడో’.. నీ ప్రేమకిదే పరాకాష్ట!

17 April, 2018 - 12:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: ఐపీఎల్‌‌లో ముంబై ఇండియన్స్‌‌కు ఐకాన్‌‌గా వ్యవహరిస్తున్న సచిన్ టెండూల్కర్‌కు క్రికెట్ అంటే ఎంత ప్రేమో మరోసారి చెప్పకుండానే చెప్పాడు. క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఈ టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పినా ఆ ఆట సరదాను నిత్యం అనుభవిస్తూనే ఉంటాడు. నిజానికి సచిన్‌ జీవితాన్ని క్రికెట్‌‌ను విడివిడిగా చూడలేమనే విషయం అందరికీ తెలిసిందే. ఎందరో యువ క్రికెటర్లకు సచిన్ మార్గదర్శి! ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తన పేరు మీద అనేక రికార్డులు లిఖించుకున్న సచిన్‌, రిటైర్‌‌మెంట్‌ తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

అయితే.. తాజాగా తన సొంత నగరం ముంబైలో రాత్రి సమయంలో సచిన్‌ ఓ రోడ్డు పక్కన సరదాగా క్రికెట్‌ ఆడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్‌ చేశారు. పరిసరాలను బట్టి అది విలేపార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం అని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్‌ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్‌ డివైడర్‌‌ని ఉపయోగించడం గమనార్హం.