సచిన్‌కు ‘హాల్ ఆఫ్ ఫేమ్’ గౌరవం

20 July, 2019 - 7:15 AM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: భారత క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ రమేశ్ టెండూల్కర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది. సచిన్‌తో పాటుగా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా పేసర్‌ క్యాథరిన్‌ ఫిట్జ్‌ప్యాట్రిక్‌లకు కూడా ఈ గౌరవం లభించింది. లండన్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వీరి పేర్లను జాబితాలో చేర్చారు. టెస్టులు (200 మ్యాచ్‌లు 15,921 పరుగులు), వన్డే (463 మ్యాచ్‌లు 18,426 పరుగులు)ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కిన సచిన్‌.. భారత్‌ నుంచి ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ఘనత అందుకున్న ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. సచిన్ కంటే ముందు బిషన్‌ సింగ్‌ బేడీ (2009), సునీల్‌ గవాస్కర్‌ (2009), కపిల్‌దేవ్‌ (2010), అనిల్‌ కుంబ్లే (2015), రాహుల్‌ ద్రవిడ్‌ (2018)లకు చోటుదక్కింది.

నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరై అయిదేళ్లు పూర్తయినందున సచిన్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి అర్హత లభించింది. 2013 నవంబరులో సచిన తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ‘తరతరాలుగా ఎందరో క్రికెటర్లను వరించిన ఈ ఘనత నాకు గౌరవప్రదమైనది. వారంతా ఆటను ఉన్నత స్థితిలో నిలిపేందుకు ప్రయత్నించారు. అందులో నా పాత్ర కొంత ఉన్నందుకు సంతోషం’ అని సచిన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘ఈ ముగ్గురూ అత్యున్నత ఆటగాళ్లు. వారికి 2019 హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఐసీసీ తరఫున వారికి అభినందనలు’ అని ఐసీసీ సీఈఓ మను సాహ్ని పేర్కొన్నారు.