‘సాహో’కి బై బై

16 June, 2019 - 5:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన ఈ చిత్రంలో నటించిన సన్నివేశాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ట్విట్టర్ వేదికగా నీల్ ఇలా స్పందించారు.

‘రెండేళ్ల క్రితం ఈ అందమైన ప్రయాణం ప్రారంభమైంది. విడుదలకు సిద్ధమవుతున్న ‘సాహో’ చిత్రంలో తన చేస్తున్న పాత్ర పూర్తి అయింది. ఈ చిత్రంలో నటించినందుకు గర్వంగాను.. ఎమోషనల్‌‌గాను ఉంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, నా సోదరుడు సుజీత్, ఆర్ మధు, శిబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్, భాస్కర్‌లకు నా కృతజ్ఞతలు’ అని నీల్ తెలిపారు.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, చంకీ పాండే, అరుణ్ విజయ్, లాల్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సుప్రీత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై బాహుబలి ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై.. భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

సాహో చిత్ర షూటింగ్ 2017లో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత ముంబయి, అబుదాబీ, దుబాయి, రోమేనియాతోపాటు యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్ర కథను కూడా దర్శకుడు సుజీత్ అందించిన సంగతి తెలిసిందే. జిబ్రాన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోదు నిర్మిస్తుండగా.. హిందీలో టీ సిరిస్ బ్యానర్‌పై  భూషణ్ కుమార్ సాహో ను విడుదల చేస్తున్నారు.