దశాబ్దపు రొమాంటిక్ హీరోయిన్!

25 February, 2018 - 6:45 PM

శ్రీదేవి.. ఆమె అందానికి ముగ్ధులు అవ్వని వారు లేరు. అలాగే దాసోహం అనని వారూ ఉండరు. శ్రీదేవి నటనకు… మైమరిచిపోయే ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే టాలీవుడ్‌ ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన పాటలో శ్రీదేవి అందాన్ని అక్షరాల్లో ఇలా పొదిగారు. ‘అమ్మ బ్రహ్మదేవుడో.. కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగస్సురో.. ఏడ దాచినావురో.. పూలరెక్కలు కొన్ని తేనెచుక్కలు రంగరిస్తవో ఇలా బొమ్మ చేస్తివో… అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా?’ ఇది అక్షర సత్యం.

తమిళనాడులోని శివకాశిలో 1963లో ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. నాలుగేళ్ల వయస్సులోనే అంటే 1967లో తునాయివన్ చిత్రం ద్వారా బాలనటిగా తెరంగేట్రం చేశారు. పౌరాణిక చిత్రాల్లో కూడా బాలనటిగా నటించారు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 260 చిత్రాల్లో శ్రీదేవి నటించారు. శ్రీదేవి అత్యధికంగా 85 తెలుగు చిత్రాల్లో నటించగా… 72 తమిళ, 71 హిందీ, 26 మలయాళ, 6 కన్నడ చిత్రాల్లో నటించారు. 15 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం శ్రీదేవిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నంది పురస్కారాలు ఆమెను వరించాయి. బుల్లి తెరపై కూడా సీరియల్స్‌‌తో పాటు పలు కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా కూడా శ్రీదేవి వ్యవహరించారు.
తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరుల పక్కన హీరోయిన్‌‌గా నటించారు. తమిళ, మలయాళ, హిందీలో పలువురు అగ్రహీరోల పక్కన హీరోయిన్‌‌గా నటించారు. వివిధ భాషల్లోని ప్రముఖ దర్శకుల డైరెక్షన్‌‌లో కూడా శ్రీదేవి నటించి మెప్పించారు.

సీనియర్ ఎన్టీయార్‌‌తో కలిసి బాలనటిగా శ్రీదేవి నటించిన బడిపంతులు చిత్రం 1972లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆయనకు మనవరాలిగా నటించారు. 1979లో విడుదలైన వేటగాడులో ఆయన సరసన హీరోయిన్‌‌గా నటించిన శ్రీదేవి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఎన్టీఆర్‌‌తో కలసి మొత్తం 12 సినిమాల్లో నటించారామె.

1973లో ఏఎన్నార్ నటించిన భక్త తుకారాం చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తెగా శ్రీదేవి నటించారు. అనంతరం 1981లో వచ్చిన ప్రేమాభిషేకంలో ఆయన పక్కన కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌‌లో 10 చిత్రాలు వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి సరసన రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, ఎస్.పి.పరశురామ్ చిత్రాల్లో శ్రీదేవి నటించిన విషయం తెలిసిందే. కానీ.. చిరంజీవి విలన్‌గా నటించిన మోసగాడు, రనువ వీరన్ చిత్రాల్లో శ్రీదేవి హీరోయిన్‌‌గా నటించారు.

నాగార్జున సరసన ‘ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా’ చిత్రాల్లో శ్రీదేవి మెప్పించారు. వెంకటేష్‌‌తో కలిసి ఒకే ఒక్క చిత్రంలో శ్రీదేవి వెండితెరను షేర్ చేసుకున్నారు. అదే ‘క్షణ క్షణం’. వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో టాలీవుడ్ హిట్. అయితే.. పేరుకి ఈ సినిమాలో హీరో వెంకటేష్… కానీ కథ మొత్తం శ్రీదేవి చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో హీరో శ్రీదేవి అని విక్టరీ హీరో వెంకటేష్ ఒకానొక సందర్భంలో స్పష్టం చేశారు. నేను జస్ట్ ఆమె పక్కన నటించానని చెప్పడం విశేషం.

శ్రీదేవితో అత్యధిక సినిమాలు చేసింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో శ్రీదేవి దాదాపు 24 సినిమాలు చేశారు. వాటిలో 15 తెలుగు చిత్రాలు ఉండగా.. 9 హిందీ చిత్రాలు. ‘నా తమ్ముడు’ షూటింగ్ సమయంలో శ్రీదేవికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రాఘవేంద్రరావు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయస్సు చిత్రంలో ఆమెకు హీరోయిన్‌‌గా చాన్స్ ఇచ్చారు దర్శకేంద్రుడు. ఆయన దర్శకత్వంలో 25వ సినిమా సిల్వర్ జూబ్లీ చిత్రంలో నటించాలని శ్రీదేవి ఆశించారు. కానీ ఆ కోరిక తీరలేదు.

తల్లి మాట జవదాటని కూతురుగా శ్రీదేవికి టాలీవుడ్‌‌లో పేరుండేది. తండ్రి చనిపోయిన విషయం తెలిసి కూడా నిర్మాతకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేసి మరీ శ్రీదేవి వెళ్ళినట్లు ఆమె సన్నిహితులు చెబుతుంటారు.1975 నుంచి 1985 వరకు అంటే దశాబ్దం పాటు ‘రొమాంటిక్ హీరోయిన్ ఆఫ్ ది డికేడ్’ అనిపించుకొన్న ఏకైక నటి శ్రీదేవి. 1996లో నిర్మాత బోని కపూర్‌‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు జాహ్నవి, కుషీ ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జాహ్నవిని హీరోయిన్‌‌గా వెండితెరపై శ్రీదేవి చూడాలనుకున్నారు. జాహ్నవి మరాఠీ సూపర్‌హిట్ చిత్రం ‘సైరత్’ హిందీ రీమేక్‌‌లో హీరోయిన్‌గా ఎంపికైంది. జాహ్నవిని తెరపైన చూసుకోకుండానే శ్రీదేవి సెలవంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం.