బంగ్లాదేశ్‌తో తొలి టీ20కి రోహిత్ ఫిట్

02 November, 2019 - 3:11 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌గానే ఉన్నాడని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. శుక్రవారంనాడు ప్రాక్టీస్‌ చేస్తుండగా అతని పొట్ట భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో కాసేపు విలవిలలాడిన రోహిత్‌ ప్రాక్టీస్‌ ఆపేసి అక్కడి నుంచి డ్రెస్సింగ్‌రూంకు వెళ్ళిపోయాడు. మళ్లీ ప్రాక్టీస్ కు రాలేదు. జట్టు ఫిజియో, వైద్యులు రోహిత్‌శర్మకు చికిత్స అందజేశారు. అనంతరం వైద్యులు అతనికి తగిలిన గాయం సాధారణమైనదే అని తేల్చారు. దీంతో తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ బరిలోకి దిగుతాడని బీసీసీఐ వెల్లడించింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో సంజూ సామ్సన్‌ పాల్గొనలేదు. రిషభ్‌ పంత్‌ చాలాసేపు చెమటోడ్చాడు. దీంతో తుదిజట్టులో పంత్‌కే అవకాశం దక్కనుంది. ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు ప్రాక్టీస్‌ సందర్భంగా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి సలహాలిచ్చాడు.

అంతకు ముందు.. బంగ్లాదేశ్తో పొట్టి సీరీస్ ప్రారంభం అవకముందే టీ20 భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బంగ్లాతో భారత్ ఆడే మూడు టీ20 మ్యాచ్ లకు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించారు.

రోహిత్ గాయంపై జట్టు మేనేజ్ మెంట్ ఒక ప్రకటన చేస్తూ ‘రోహిత్ చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాం’ అని చెప్పింది. బంగ్లా పేస్ బౌలర్లను ఎదుర్కోవడానికి ప్రాక్టీసులో బంతులు వేగంగా విసిరే శ్రీలంక స్పెషలిస్ట్ త్రోవర్ నువాన్ ను జట్టు మేనేజ్ మెంట్ రప్పించింది. భారత్- బంగ్లా తొలి టీ 20 ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది.