రోహిత్ శర్మకు మ్యాచ్ ఫీజులో కోత!

29 April, 2019 - 2:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కోల్‌‌కతా: ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా పడింది. మైదానంలో ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందుకు రోహిత్ శర్మ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది.

దీంతో ఐపీఎల్‌‌లో అంపైర్ల అనుమానాస్పద నిర్ణయాలపై జట్ల కెప్టెన్ల రుసరుసలు కొనసాగుతూనే ఉన్నట్లయింది. మొన్న ధోని.. నిన్న కోహ్లీ.. ఇప్పుడు రోహిత్‌శర్మ. ఇలా అంపైర్ల నిర్ణయాలపై క్రికెటర్లు తమ అసహనాన్ని మైదానంలోనే వ్యక్తం చేస్తున్నారు.

కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో 233 పరుగుల భారీ లక్ష్యంతో ముంబై ఇండియన్స్‌ లక్ష్యఛేదనకు దిగింది. కోల్‌‌కతా ఫాస్ట్‌ బౌలర్‌ గర్నీ నాలుగో ఓవర్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. ఆ ఓవర్‌‌లో మూడో బంతికి రోహిత్‌ శర్మను అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. రోహిత్‌ శర్మ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరాడు. ఆ సమీక్షలో బంతి పిచింగ్‌ ఔట్‌ సైడ్‌‌లో పడటంతో పాటు లెగ్‌ వికెట్‌‌ను కొంచెం తాకుతూ వెళ్లినట్లు కనిపించింది.

దీంతో థర్డ్‌ అంపైర్‌.. ‘అంపైర్స్‌ కాల్‌’కు అవకాశం ఇచ్చాడు. మైదానంలో అంపైర్‌‌గా ఉన్న నితిన్‌ మీనన్‌ ముంబై ఔట్‌‌గా ప్రకటించడంతో రోహిత్‌ అసహనానికి గురయ్యాడు. బౌలింగ్‌ ఎండ్‌‌లో ఉన్న అంపైర్‌ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగని రోహిత్ శర్మ వికెట్లను తన బ్యాట్‌తో కొట్టాడు.

దీంతో.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రోహిత్‌ శర్మకు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఇంతకు ముందు ధోనీకి కూడా జరిమానా పడింది. ఈ మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్‌ 34 పరుగుల తేడాతో పరాజయం పాలవడం గమనార్హం.