రోహిత్ సెంచరీ వృథా.. ఓడిన భారత్

12 January, 2019 - 5:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సిడ్నీ: దూకుడుగా ఆడి 129 బంతుల్లో 133 పరుగులు చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ వృథా అయిపోయింది. మూడే వన్డేల సీరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును ఆసీస్ గడ్డపైనే టెస్ట్ మ్యాచ్‌లలో గడగడలాడించిన విరాట్ సేన తొలి వన్డేలోనే ఓడిపోయింది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 289 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొమ్మిది వికెట్ల నష్టపోయి 254 పరుగులకే పరిమితమైంది. దీంతో మూడు వన్డేల సీరీస్‌‌లో ఆసీస్‌ 0-1 ఆధిక్యంలో నిలిచింది. రోహిత్‌ శర్మ(133) సెంచరీ చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. జట్టు స్కోరును పెంచే క్రమంలో రోహిత్‌ ఏడో వికెట్‌‌గా ఔటయ్యాడు. రోహిత్‌‌కు జతగా ఎంఎస్‌ ధోని (51) మినహా ఎవరూ కలిసిరాలేదు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఖవాజా (59), షాన్‌ మార్ష్‌ (54), హ్యాండ్ స్కాంబ్‌ (73)లు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. వారితో పాటు మార్కస్‌ స్టోనిస్‌ (47 నాటౌట్‌) ఆకట్టుకోవడంతో ఆసీస్‌ గౌరవమైన స్కోరు సాధించింది. భార‌త బౌల‌ర్లలో భువ‌నేశ్వర్‌, కుల్దీప్‌‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. జ‌డేజా ఒక్క వికెట్ తీశాడు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయి ఆదిలోనే పీకలోతు కష్టాల్లో పడింది. నాలుగు పరుగులకే మూడు మెయిన్ వికెట్లు కోల్పోవడంతో టీమిండియా‌పై ఒత్తిడి పెరిగింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ డకౌట్‌ అయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై ‘గోల్డెన్‌ డక్‌’గా అపప్రథ మూటగట్టుకున్నాడు. తర్వాత విరాట్‌ కోహ్లి (3) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో ఓవర్లోనే పెవిలియన్‌ చేరాడు. రిచర్డ్‌‌సన్‌ వేసిన మూడో బంతిని ఆడబోయిన కోహ్లీ (3) స్టోనిస్‌‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఆ వెంటనే అంబటి రాయుడు కూడా డకౌట్‌ అవడంతో భారత్‌ మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది.ఆ తరుణంలో రోహిత్-ధోని జోడీ ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 137 పరుగుల భాగస్వామ్యం జతచేసిన తర్వాత ధోని నాల్గో వికెట్‌‌గా ఔటయ్యాడు. అనంతరం రోహిత్‌‌కు ఒక్క బ్యాట్స్‌మన్ నుంచీ సహకారం దొరకలేదు. దినేశ్‌ కార్తీక్‌ (12), రవీంద్ర జడేజా(8) నిరాశపరచడంతో భారత్‌‌కు ఓ‍టమి తప్పలేదు. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌ (29 నాటౌట్‌) ధాటిగా బ్యాటింగ్‌ చేసినా అప్పటికే భారత్‌కు నష్టం జరిగిపోయింది.

ఆసీస్‌ బౌలర్లలో యువ పేసర్‌ రిచర్డ్‌‌సన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బెహ్రాన్‌‌డార్ఫ్‌, మార్కస్‌ స్టోనిస్ చెరో రెండు వికెట్లు తీశారు. పీటర్‌ సిడెల్‌‌కు వికెట్‌ లభించిది. ఈ జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరుగుతుంది.