పంత్ ఏకాగ్రతను దెబ్బతీయొద్దు

09 November, 2019 - 11:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నాగ్‌పూర్‌: బంగ్లాదేశ్‌తో భారత్ ఆడిన రెండు టీ-20 మ్యాచుల్లో బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అంతగా సక్సెస్ కాలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ రిషబ్ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. కొద్ది కాలంపాటు విమర్శకులు, మీడియావారు పంత్‌ విషయంలో పట్టించుకోకుండా ఉండాలని కోరుకుంటున్నానన్నాడు. అప్పుడే తానేంటో పంత్ నిరూపించుకుంటాడన్నాడు. అతని ఏకాగ్రతను దెబ్బతీయవద్దని మీడియాను రోహిత్ కోరాడు.

‘ప్రస్తుతం ప్రతీ రోజు, ప్రతీ క్షణం పంత్‌ గురించే తీవ్రంగా చర్చ జరుగుతోందని మీ అందరికీ తెలుసు. అయితే.. ప్రతీ ఒక్కరికీ నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. కొంతకాలం మీ దృష్టి పంత్‌పై కాకుండా వేరేవాటిపై పెట్టాలని కోరుకుంటున్నా. కొంతకాలం పంత్‌ గురించి పట్టించుకోవడం మానేస్తే అతడు గొప్పగా ఆడటానికి సహాయం చేసినవారవుతారు. పంత్‌ ఒక ఫియర్‌లెస్‌ క్రికెటర్‌. మేం (టీమ్‌ మేనేజ్‌మెంట్‌) అతడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అనుకున్నాం. దీనిలో భాగంగా పంత్‌ మైదానంలో ఏం చేయాలనుకుంటున్నాడో దానిని అనుమతించాలని నేను భావించాను. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజీ ప్రకారమే అతడు ఆడుతున్నాడు. అయితే.. విఫలమవుతున్నాడు. పంత్‌పై ఫోకస్‌ ఎక్కువగా ఉంది. మైదానంలో అతడు వేసే ప్రతీ అడుగు గురించీ చర్చిస్తున్నారు. ఫెయిల్‌ అయితేనే కాదు సక్సెస్‌ అయినప్పుడు కూడా పంత్‌ని ఆకాశానికి ఎత్తుతున్నారు. మీ అందరికీ ఒక్కటి చెప్పదల్చుకున్నాను. అతడి వయసు కేవలం 22 ఏళ్లే. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. అలా అని అతడిని వెనకేసుకు రావడం లేదు. అతడిలో అపార ప్రతిభ ఉంది కాబట్టే మేం అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఒక్కసారి సెటిలైతే అతడు గొప్ప క్రికెటర్‌గా మారడం ఖాయం’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

‘రిషబ్ పంత్ జట్టులో అవసరమా?’ అనేది ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చ జరుగుతున్న ప్రధాన అంశం. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టీ20ల్లో భారత యువ సంచలనం రిషభ్‌ పంత్‌ ఘోరంగా విఫలం కావడంతో అతడిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అటు కీపింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అంచనాల్ని అందుకోలేకపోతున్న పంత్‌ జట్టులో అవసరమా అంటూ పంత్‌ హేటర్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో పంత్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మద్దతుగా నిలబడ్డాడు. తాజాగా టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌శర్మ కూడా పంత్‌కు మద్దతుగా నిలిచాడు.

భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 సీరీస్‌లో చివరిది, సీరీస్ నిర్ణయించే కీలక మ్యాచ్ ఆదివారం నాగపూర్‌లో జరగనుంది. మూడు మ్యాచ్‌ల సీరీస్‌లో భారత్, బంగ్లా చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి.