అద్యంతం ‘రామ’ నామస్మరణ

14 February, 2019 - 3:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల వర్మ అంటేనే సంచలనం. ఆయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. జీవీ ఆర్జీవీ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ‘కుటుంబ కుట్రల చిత్రం’ అనే ట్యాగ్ లైన్‌ పెట్టింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిబ్రవరి 14 అదీ.. ప్రేమికుల దినం రోజున విడుదల చేయడం విశేషం.

1989 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన రోజులవి.. అంటూ ఈ చిత్ర ట్రైలర్ ప్రారంభమవుతోంది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల జీవితంలో చోటు చేసుుకున్న పలు ఎమోషనల్ సీన్స్ ఈ టీజర్‌లో చోటు కల్పించారు.

వైస్రాయి హోటల్ వద్ద… ఎన్టీఆర్‌పై చెప్పులు విసరడం… ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చి కుప్పకూలిపోవడంతోపాటు నా మొత్తం జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు వాడిని నేను నమ్మడం అంటూ ఎన్టీఆర్ కన్నీటి పర్యంతంతో చెప్పడంతో ఈ చిత్ర ట్రైలర్ పూర్తి అవుతుంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని సంచలనానికి వేదికగా చేసేందుకు దర్శకుడు వర్మ ప్రయత్నిస్తున్నాడనే విషయం ఈ చిత్ర ప్రారంభోత్సవంతోనే అర్థమైంది. ఆ తర్వాత ఈ చిత్రంలోని పాటలు విడుదల చేయడం.

అలాగే సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి సోదరుడు కళ్యాణ్ మాలిక్‌ను ఎంపిక చేసుకోవడం.. అదేవిధంగా ఎన్టీఆర్‌గా పశ్చిమగోదావరి జల్లాకు చెందిన రంగస్థలం కళాకారుడు, లక్ష్మీపార్వతీగా కన్నడ నటి యజ్ఞ శెట్టి, నారా చంద్రబాబు నాయుడుగా శ్రీతేజ్‌ని ఎంపిక చేశారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.