ఒకేసారిగా 1,33,867 ఉద్యోగాల భర్తీ

18 July, 2019 - 8:45 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే విడతలో 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు వస్తోంది. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై 50 రోజులు కూడా పూర్తి కాకుండానే తద్వారా చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం జరుగుతుంది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో పెట్టాల్సిన ఫైలుకు సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ఆమోదముద్ర వేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. వీటిలో పని చేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 34,723 మంది ఉద్యోగులను నియమిస్తారు. గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగుల నుంచి 12 మంది వరకూ పనిచేసేలా నిర్ణయించగా, వార్డు సచివాలయాల్లో పది మంది చొప్పున ఉద్యోగులు పనిచేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వారు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

కొత్తగా 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత వీటి భర్తీకి కేవలం వారం పది రోజుల వ్యవధిలో శాఖల వారీగా నోటిఫికేషన్లు వెలువడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్‌ సమయంలోనే ఏ ఉద్యోగానికి ఏ విద్యార్హత అనే వివరాలను ఆ శాఖలు వెల్లడిస్తాయి. నోటిఫికేషన్లలో శాఖల వారీగా వెలువరించిన ఉద్యోగాలను జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ (డీఎస్‌సీ)లు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తాయి. ఈ ఉద్యోగాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్ల మేరకు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది.