కేసీఆర్.. ఇంత అరాచకమా?

04 December, 2018 - 9:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వికారాబాద్: తెలంగాణ అపద్దర్మ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. జడ్చర్ల నుంచి కొండగల్ స్వగృహానికి చేరిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో కేసీఆర్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

2009 ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా గెలిచారని.. ఈ విజయం సాధించడంలో కొండగల్ ప్రజల పాత్ర ఉందని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత కొడంగల్ ప్రజలవైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. కేసీఆర్ కుట్రలను కొడంగల్ ప్రజలు తిప్పికొడతారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు‌.

కొడంగల్‌పై రూ.150 కోట్ల లావాదేవీలతో కేసీఆర్ యుద్ధం ప్రకటించారని రేవంత్ ఆరోపించారు. ఈ ఏడాది కొనుగోళ్ల కోసం రూ. 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. పోలీస్ వాహనాల్లోనే నగదు సరఫరా చేసే పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నియంత పాలనలో కూడా ఇంతటి అరాచకాలు చూడలేదన్నారు. మా ఇంటి తలుపులు విరగొట్టి.. పోలీసులు దౌర్జన్ంగా లోపలికి వచ్చారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.