‘అది ఏ క్షణమైనా బయటపడవచ్చు’

08 November, 2018 - 6:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీలోని లుకలుకను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి బయటపెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు, మంత్రి హరీష్ రావుకు మధ్య తీవ్ర విభేదాలున్నాయని తెలిపారు.

హరీష్‌రావుతో మాట్లాడిన తర్వాతే గజ్వేల్ నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. అందుకు మినిష్టర్ క్వార్టర్స్ వేదిక అయిందన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో అక్టోబర్ 25వ తేదీ సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలో రేవంత్ మాట్లాడుతూ… ‘కారు’ డ్రైవర్‌ని మార్చాలని హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మామా అల్లుళ్ల మధ్య విభేదాలు పెచ్చుమీరాయని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ కలయికను టీఆర్ఎస్ తప్పుపట్టడంపై రేవంత్ ఈ సందర్భంగా స్పందించారు. ఇది ఓ విధంగా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమే అని ఆయన పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట తీవ్రమైందని.. అది ఏ క్షణమైనా బయటపడే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ ప్రకటించిన 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల్లో 40 మంది ఎట్టి పరిస్థితుల్లో గెలవరన్నారు. చీప్ లిక్కర్ సీఎం కంటే సీల్డ్ కవరు సీఎం నయమని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు.