‘ఒక్క నిప్పు రవ్వే చాలు మీ కొంప తగలబెట్టడానికి’

13 January, 2018 - 3:41 PM

                                                      (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: విద్యుత్ సరఫరాపై టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ , కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యుత్ సరఫరాపై బహిరంగ చర్చకు సవాల్ ,ప్రతిసవాల్ విసురుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఎంపీ బాల్కసుమన్ పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను అడుగుతోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బాల్క సుమన్ ప్రతి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో తాను ప్రశ్నించానని దాని గురించి మాట్లాడకుండా మతి తప్పినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

బాల్క సుమన్ తనను రవ్వంత అన్నాడని.. టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి కొంపను తగలబెట్టడానికి ఒక్క నిప్పు రవ్వే చాలని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2008లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉందని, 2008లో జంట నగరాల్లో 24 గంటల నిరంతర విద్యుత్‌ ఇవ్వాలని, అలాగే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అప్పట్లో ఆంధ్ర ప్రాంతానికి 53.89శాతం తెలంగాణకు 46.11శాతం విద్యుత్‌ వినియోగం కేటాయించారని వివరించారు.

సీఎం కేసీఆర్‌ తప్పుడు విధానాలను బయటపెట్టిన ఎంపీ బాల్క సుమన్‌ను అభినందిస్తున్నానని రేవంత్ అన్నారు. అలాగే కేసీఆర్‌ నిర్ణయాల వల్ల అధికారులు జైళ్లకు వెళ్లే పరిస్థితి వచ్చిందని, జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేటు సంస్థలను నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విద్యుత్‌పై చర్చ విషయంలో ప్రభుత్వం పారిపోయిందని, మమ్మల్ని తిట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు.