ఇంతకీ రేవంత్ వెనక ఉన్నది ఎవరంటే ?

09 October, 2018 - 4:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర ప్రజలకూ పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి… ఆనక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ పార్టీలో ఉన్నా ఆయన ప్రత్యర్థి మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్… ఆయన ఫ్యామిలీనే. ఇది ప్రజలందరికీ తెలిసిన అక్షర సత్యం. అదీకాక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో నోరున్న నేత ఒక్కరూ లేరు. అలాంటి సమయంలో రేవంత్  కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆ పార్టీ నేతలకు దేవుడిచ్చిన ఓ వరం అనే చెప్పాలి.

ఎందుకంటే తన పంచ్ డైలాగులతో కారు పార్టీ నేతల్లో ఓ విధమైన కంగారు పుట్టించగల సత్తా ఉన్న ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇప్పటికే తెలంగాణ ప్రజల గుండెల్లో రేవంత్‌రెడ్డి పేరు గూడుకట్టుకు పోయింది. ఇంకా చెప్పాలంటే… రేవంత్ నోటి నుంచి వచ్చే పంచ్ డైలాగ్స్ తూటాల రూపంలో కాదు.. నిప్పు రవ్వల రూపంలో ఉంటాయి. నిప్పు రవ్వల్లాంటి మాటలతో నిత్యం గులాబీ దళాన్ని రగిలిస్తూనే ఉంటారాయన. అందులో ఎటువంటి సందేహం లేదు.

అయితే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దూసుకొస్తుండటంతో హస్తం పార్టీ, సైకిల్ పార్టీ, కోదండరామ్ పార్టీ ఇలా పలు పార్టీలు కలసి ఒక్క తాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. కాగా.. గులాబీ బాస్ కేసీఆర్ టార్గెట్ మాత్రం తెలంగాణలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, జానారెడ్డి ఇతర సీనియర్లు కానే కాదు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణలో ఏ సభలో మండిపడ్డా… అదీ చంద్రబాబుని లక్ష్యంగా చేసుకునే. అయితే చంద్రబాబు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలపై కించిత్ కూడా స్పందించరు.

కానీ చంద్రబాబుపై కేసీఆర్ ఇలా ఫైర్ అవ్వగానే.. రేవంత్‌రెడ్డి అలా స్పందించేస్తారు. అంతేకాదు చంద్రబాబు… కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవల్సి వచ్చిందో కూడా సామాన్యునికి సైతం ఇట్టే అర్థమయ్యేలా వివరిస్తారు రేవంత్ రెడ్డి. అలాగే సైకిల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కదా అని ప్రజల్ని సైతం కన్విన్స్ చేసే పరిస్థితికి రేవంత్ తీసుకొస్తారు.

మహాకూటమిలోని నాయకులంతా ఒక ఎత్తయితే… రేవంత్‌రెడ్డి ఒక ఎత్తు. కేసీఆర్‌ అంటేనే రేవంత్‌రెడ్డి ఒటికాలి మీద లేస్తారు. అంతేకాదు.. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తే.. వాటికి దీటైన సమాధానం ఇచ్చారు రేవంత్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చంద్రబాబు… ఆయన పార్టీపైన ఈగ కూడా వాలనీయకుండా రేవంత్ పహారా కాస్తున్నారనే చెప్పాలి.

రేవంత్.. కాంగ్రెస్‌లో ఉన్నా… టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే హస్తం పార్టీలోని నేతలు చర్చకు తెర తీశారు. అంతేకాదు… చంద్రబాబు పక్కా వ్యూహంలో భాగంగానే రేవంత్‌… కేసీఆర్‌పై ఫైరింగ్ అవుతున్నారని కూడా ఏపీలో గుసగుసలు హోరెత్తాయి. ఎందుకంటే… చంద్రబాబుది చాణక్య నీతి. తనకు మకిలి అంటకుండా.. తాను అనుకున్న వారితో పనులు కానిచ్చేస్తుంటారు. ఇది చంద్రబాబు నైజం. రేవంత్ వెనక ఉన్నది ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుందనుకుంటా!