నవజ్యోత్ సింగ్ సిద్దూకు విముక్తి

15 May, 2018 - 2:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పంజాబ్‌ మంత్రి, వెటరన్ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు విముక్తి లభించింది. 1988 నాటి కేసులో సిద్దూపై ఉన్న దోషపూరిత హత్య ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఓ వ్యక్తిని గాయపర్చినందుకు ఆయనకు వెయ్యి రూపాయాల జరిమానా మాత్రం విధించింది.

1988 డిసెంబర్ 17న పాటియాలాలోని రహదారి మధ్యలో వాహనాన్ని నిలిపిన ఘటనలో గుర్నాంసింగ్‌ అనే వ్యక్తికి సిద్దూకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో సిద్దూ వెంట ఆయన మిత్రుడు రూపీందర్‌ సింగ్‌ సంధు కూడా ఉన్నారు. ఈ క్రమంలో గుర్నాంసింగ్‌‌పై సిద్దూ చేయిచేసుకున్నారు. ఈ ఘటనలో గుర్నాంసింగ్‌ మరణించారు.

దీంతో సిద్దూనే ఆయనను కొట్టి చంపేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ట్రయల్‌ కోర్టు తోసిపుచ్చగా.. పంజాబ్‌, హర్యానా హైకోర్టు సమర్థించింది. ఈ ఘటనను దోషపూరిత హత్యగా పేర్కొంటూ 2006లో సిద్దూకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 2007లో సిద్దూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సిద్దూ జైలు శిక్షను నిలిపివేసి బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే గుర్నాంసింగ్‌‌ను గాయపర్చినందుకు రూ. 1000 జరిమానా విధించింది. ఆయన స్నేహితుడిని సైతం సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది.