విడుదలకు ముందే సై….రా

19 September, 2019 - 6:48 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహరెడ్డి. ఈ చిత్ర ట్రైలర్ బుధవారం విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా దూసుకెళ్తుంది. ఈ ట్రైలర్ విడుదల చేసిన 24 గంటల్లో 62 లక్షలకుపైగా వ్యూస్‌కి చేరింది. దీంతో యూట్యూబ్‌లో ఈ సైరా ట్రైలర్ ట్రెండింగ్‌లో కొత్త సంచలనాలకు తెర తీసింది. మరి కొద్దిసేపట్లో ఈ ట్రైలర్ వ్యూస్ కోటికి చేరుతుందని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.
ఈ ట్రైలర్‌కి వచ్చిన లైకులు అయితే మూడున్నర లక్షలకు చేరువలో ఉంది. ఇక ఈ ట్రైలర్‌కు వచ్చిన కామెంట్స్ 20 వేలకు ఇప్పటికే చేరిపోయింది. ఇక ఈ కామెంట్స్‌ ను పరిశీలిస్తే..  స్వాతంత్ర్య సమరయోధుడు పాత్రలో ఒదిగిపోయి నటించిన హీరో చిరంజీవి అభినయం, డైలాగ్స్, యుద్ధ పోరాట సన్నివేశాలు బాగున్నాయంటూ చిరు ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.  అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న విషయం విధితమే. అలాగే తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సైతం ఈ చిత్ర ట్రైలర్ వ్యూస్ పరంగా పాత రికార్డుల దుమ్ము దులుపుతోంది.
కొణిదెల ప్రోడక్షన్ కంపెనీ పతాకంపై ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అమితాబచ్చన్, నయనతారా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా కీలకపాత్రలు పోషించారు.