బెంగళూరు మూడోసారి అతిపెద్ద విక్టరీ

15 May, 2018 - 11:35 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ఇండోర్‌: ఐపీఎల్‌‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌‌లో కింగ్స్‌ పంజాబ్‌‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌‌లో మరో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అంతే కాకుండా ఇలా వికెట్‌ నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో గెలవడం బెంగళూరుకు ఇది మూడో సారి కాగా.. ఏ జట్టు కూడా ఇలా ఒకసారికి మించి గెలవలేకపోవడం గమనార్హం.

2010 సీజన్‌‌లో తొలిసారి రాజస్థాన్‌ రాయల్స్‌‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌‌లో 89 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించిన ఆర్సీబీ.. 2015లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌‌పై 96 పరుగుల లక్ష్యాన్ని మరోసారి ఛేదించింది. ఇక తాజాగా పంజాబ్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో 89 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించి ఐపీఎల్‌ చరిత్రలో మూడు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు స్పష్టించింది.

పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌‌లో మూడు వికెట్లు సాధించి పంజాబ్‌‌పై ఐదో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకోగా ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డుకెక్కాడు. వార్నర్‌ 4 సార్లు ఈ ఘనత సాధించాడు. ఉమేశ్‌ యాదవ్‌ తర్వాత యూసుఫ్‌ పఠాన్‌ (దక్కన్‌ చార్జర్స్‌‌పై) మాత్రమే ఒకే ప్రత్యర్థిపై ఐదు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.