ప్రమాదకర స్థాయికి భారత ద్రవ్యలోటు

13 October, 2019 - 1:54 AM

(న్యూవేవ్స్ డెస్క్)

షికాగో: భారతదేశం ద్రవ్య లోటు ప్రమాదకర స్థాయిలో ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందుతున్న తరుణంలో నిర్ణయాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2016లో భారత వృద్ధి రేటు 9 శాతం ఉండగా, క్రమక్రమంగా ఇప్పుడు 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.

ఈ క్రమంలో భారతదేశంలో పెట్టుబడులు, వినియోగం, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని కీలక నిర్ణయాలలో రాజకీయ వ్యవస్థ విపరీతమైన జోక్యం చేసుకుంటోందని రఘురామ్ రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్‌టీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ల పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, పంపిణీ వ్యవస్థకు ప్రాధాన్యమిస్తుందని అన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు. విదేశీ పోటీని ఆహ్వానించాలని, కొందరు వాదిస్తున్నట్లుగా మన సంస్కృతి, సంప్రదాయాలకు ఏ మాత్రం విఘాతం కలగదని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.