మావోయిస్టుగా రానా

19 April, 2019 - 4:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

దగ్గుబాటి రానా. ఈ హీరో ఏ చిత్రంలో నటిస్తే.. ఆ పాత్రలో అలా ఒదిగిపోవడం ఆయన సహజ లక్షణం. లీడర్, కృష్ణం వందే జగద్గురం, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ల్కూజన్,… నేనే రాజు నేనే మంత్రి ఇలా ఏ సినిమా తీసుకున్న ఆయన ఆ సినిమాలోని పాత్రలో కనిపిస్తారు.

తాజాగా రానా .. విరాట పర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రానా మావోయిస్టుగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది.

గతంలో తెలంగాణలో నక్సలైట్లు ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సమయంలోని ఒక సంఘటనను ఇతివృత్తంగా మలచి.. ఈ చిత్రానికి దర్శకుడు వేణు ఉడుగుల శ్రీకారం చుట్టినట్లు సమాచారం. నీది నాది ఒకే కథ చిత్రం ద్వారా వేణు ఉడుగుల తెలుగు దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తుండగా.. ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తుంది.

అయితే ఈ చిత్రంలో టబు పాత్ర కోసం ముందుగా రాములమ్మ విజయశాంతితో దర్శకుడు వేణు ఉడుగుల సంప్రదింపులు జరిపారట. తాను రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నానని.. ఈ నేపథ్యంలో ఇప్పట్లో నటించే అవకాశం లేదని విజయశాంతి స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో దర్శకుడు వేణు.. టబుతో టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది.