రవితేజ ‘నేల టిక్కెట్’ రివ్యూ!

25 May, 2018 - 2:38 PM

సినిమా: నేల టిక్కెట్టు
జానర్: రివెంజ్‌ డ్రామా
నటీ నటులు: రవితేజ, మాళవికా శర్మ, జగపతిబాబు, సంపత్‌‌రాజ్, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, అజయ్, సురేఖావాణి, ప్రియదర్శి, బ్రహ్మాజీ.
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
దర్శకత్వం: కల్యాణ్‌ కృష్ణ కురసాల
నిర్మాత: రామ్‌ తళ‍్లూరి

మాస్‌ మహరాజా రవితేజ కొంతకాలంగా తన స్థాయికి తగినట్టుగా ప్రేక్షకుల్ని అలరించలేక అవస్థలు పడుతున్నాడు. ఇటీవల రాజా ది గ్రేట్‌ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టు కనిపించినా తరువాత టచ్‌ చేసి చూడు సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు సాధించిన కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు మే 25న వచ్చాడు.

రెండు బ్లాక్‌‌బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న కల్యాణ్ కృష్ణ హ్యాటిక్ విజయం కోసం రామ్ తాళ్లూరి నిర్మాతగా నేల టిక్కెట్టును రూపొందించారు. రవితేజతో కొత్త భామ మాళవిక శర్మ జతకట్టింది. టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్‌‌లుక్‌‌‌లు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెంచాయి.పక్కా మాస్‌ టైటిల్‌‌తో వెండితెరకు ఎక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు సినిమా బృందం. నేల టిక్కెట్టుతో రవితేజ మళ్లీ ఫాంలోకి వచ్చాడా? దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ హ్యాట్రిక్‌ హిట్ సాధించాడా?

నేల టిక్కెట్టు కథేంటంటే..:
ఆదిత్య భూపతి (జగపతి బాబు) తండ్రి ఆనంద భూపతి (శరత్‌‌బాబు) వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల పేరుతో తండ్రి ఆస్తిని దానం చేసేస్తున్నాడని ఆనంద భూపతిని చంపించేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్‌ గౌతమి మీద హత్యా ప్రయత్నం చేస్తాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకోవటం, కబ్జాలు, దందాలు చేస్తూ వేల కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు.

నేలటిక్కెట్టు కథలో హీరో అనాథ (రవితేజ). అమ్మానాన్నతో పాటు కనీసం పేరు కూడా లేని హీరోని చేరదీసిన వ్యక్తి థియేటర్‌‌లో నేల టిక్కెట్టులో పడుకోబెడతాడు. అప్పటి నుంచి అదే హీరో ఇల్లు, పేరు అవుతుంది. నేల టిక్కెట్టు పేరుతోనే పెరిగి పెద్దవాడైన హీరో.. తనను అన్నా.. తమ్ముడు అని పిలిచిన ప్రతీ వారికి కాదనకుండా సాయం చేస్తుంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పే హీరో ఓ కేసు కారణంగా ఫ్రెండ్స్‌‌తో సహా వైజాగ్‌ వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది.అలా హైదరాబాద్‌ చేరిన హీరో అనుకోకుండా మినిస్టర్‌ ఆదిత్య భూపతి మనుషులతో గొడవ పడతాడు. ఆదిత్య భూపతికి, హీరోకి మధ్య గొడవ ఏంటి? అసలు హీరో వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ ఎందుకు వచ్చాడు? ఆదిత్య భూపతి అవినీతిని, దుర్మార్గాలను ఎలా బయటపెట్టాడు? అనేది మిగతా కథ.

ఈ సినిమాకు ప్రధాన బలం హీరో రవితేజ. తనదైన ఎనర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌‌తో సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కామెడీ టైమింగ్‌‌తో పాటు యాక్షన్‌, రొమాన్స్‌‌లో బాగా ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే బలమైన సన్నివేశాలు లేకపోవటం ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. హీరోయిన్‌‌గా పరిచయం అయిన మాళవికా శర్మ లుక్స్‌ పరంగా ఆకట్టుకున్నా నటిగా మాత్రం మెప్పించలేకపోయింది. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేనిది మాళవికా శర్మ పాత్ర. ఆట పాటలకు, అందాల ఆరబోతకు మాత్రమే పరిమితమైంది.

విలన్‌‌గా జగపతిబాబు మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించారు. నేల టికెట్టు చిత్రంలో కథ అంతా జగపతిబాబు చుట్టూనే తిరుగుంది. ప్రధానంగా విలన్ యాంగిల్‌‌లో నడవడంతో జగపతిబాబు పాత్ర హైలెట్‌‌గా ఉంటుంది. జగపతిబాబు బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, విలనిజం కొత్తగా ఉంటాయి.
అలీ, ప్రవీణ్‌, సంపత్‌‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌రెడ్డి, పృథ్వి, ప్రియదర్శి ఎందరో నటీనటులు ఉన్నా ఎవరికీ బలమైన సన్నివేశాలు మాత్రం పడలేదనే చెప్పుకోవాలి.విశ్లేషణ:
‘చుట్టూ జనం మధ్యలో మనం’ అనే పాయింట్‌‌ను దృష్టిలో పెట్టుకొని కల్యాణ్ కృష్ణ చేసిన మాస్ కథా చిత్రం నేలటికెట్టు. చెప్పుకోవడానికి పెద్దగా కథలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఎమోషనల్ సీన్లు పేర్చుకొంటూ వెళ్లిన తీరు ఆయన ప్రతిభకు అద్దం పట్టింది.

సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం లాంటి ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌లను తీర్చిదిద్దిన కల్యాణ్‌ కృష్ణ మూడో ప్రయత్నంగా మాస్‌ హీరోతో ఓ కమర్షియల్‌ కథను ఎంచుకున్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌‌తో పాటు సందేశాత్మక కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆ కథను ప్రేక్షకులను మెప్పించేలా తెర మీద చూపించటంలో తడబడ్డాడనే చెప్పాలి. సినిమా మొదటి సగం అంతా అసలు కథను మొదలు పెట్టకుండా సరదా సన్నివేశాలతో లాగించేశాడు. ఆ సన్నివేశాల్లో రవితేజ మార్క్‌ కామెడీని పండించలేకపోవటంతో ఆడియన్స్‌ ఇబ‍్బంది పడతారు. రెండో సగంలో అసలు కథ మొదలైనా కథనంలో వేగం లేనందున నిరాశపరుస్తుంది.

ఫిదా సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించిన సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌ నేల టిక్కెట్టులో మాత్రం మెప్పించలేక పోయాడు. ఎడిటింగ్‌ విషయంలో మరికాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. సినిమాటోగ్రఫి నిర్మాణ విలువలు బాగున్నాయి.

బడ్జెట్‌ పరిమితుల కారణమో ఏమో కానీ సినిమాను చుట్టేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కల్యాణ్‌ బలమైన కథను రాసుకోవాల్సింది. దాన్ని తీర్చదిద్దడంలో నైపుణ్యం కొరవడింది. దర్శకుడిగానే కాదు రచయితగానూ ఇంకా కసరత్తులు చేస్తే బాగుండేది. అంచనాలేవీ పెట్టుకోకుండా సరదాగా సినిమా చూసొద్దామనే ప్రేక్షకులకు, రవితేజ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా పక్కా చాయిస్. కొత్తదనం ఆశించే వారికి కొంత నిరాశ మిగులుస్తుంది. వీకెండ్ సినిమా లవర్స్‌కు టైంపాస్ మూవీ.

ప్లస్‌ పాయింట్స్‌:
రవితేజ
కొన్ని ఎమోషనల్‌ సీన్లు
చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెప్ట్‌
మైనస్‌ పాయింట్స్‌:
కథా కథనం
సంగీతం
సినిమా నిడివి
వినోదం లేకపోవడం