29న వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్

19 March, 2019 - 3:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. అసలు కథ అనేది ఈ చిత్రం ఉప శీర్షిక. ఈ చిత్రం మార్చి 29న విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ వర్మ ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం మార్చి 22న విడుదలవుతుందంటూ ప్రకటించారు. ఆ తర్వాత ఈ చిత్రం విడుదలవుతున్న రోజునే మరో రెండు చిత్రాలు విడుదల కానున్నాయి.

ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ ఈ చిత్రం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహలు చేసింది కూడా. కానీ ఇంతలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎన్నికల అయిన తర్వాత విడుదల చేయాలని కోరుతూ.. టీడీపీ కార్యకర్త దేవి బాబు చౌదరి… కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

దాంతో ఈ వ్యవహారాన్ని చూడాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం… రాష్ట్ర సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మను సెన్సార్ బోర్డు ఆదేశించింది. అయితే సెన్సార్ బోర్డుపై వర్మ నిప్పులు చెరిగారు. న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆడియో ఫంక్షన్ కడపలో నిర్వహిస్తానని ఇప్పటికే వర్మ ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కడపలో జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. లక్ష్మీపార్వతీని వివాహం చేసుకోవడం… ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఈ చిత్రంలో చూపిస్తారు. ముఖ్యంగా చంద్రబాబును విలన్‌గా చూపించనున్నారని టాక్ వైరల్ అవుతోంది.